ధర్మి, ధర్మము నని సార మిఱుదెఱఁగులు. సమాహితముకూడ 2 విధములే. దండి సమాహితభేదములఁ బేర్కొనలేదు. విరోధము శబ్దాలంకారములలోఁ గూడఁ జేరును గాని, సంఖ్యాగౌరవభీతిచే దీని నాప్రకరణమునఁ జెప్పక యిటఁ బేర్కొనుచుంటి నని రసార్ణవకారుఁడు వ్రాసియున్నాఁడు.
సంభవము 4 విధములు:- 1. విధి. 2. నిషేధము. 3. ఉభయరూపము. 4. ఉభయవర్జితము.
వ్యతిరేకము 7 తెఱఁగులు:- 1. ఏకవ్యతి రేకము. 2. ఉభయవ్య. 3. సదృశవ్య. 4. అసదృశవ్య. 5. సజాతివ్య. 6. వ్యక్తివ్య. 7. రూపకప్రకృతి.
[భామహుఁడు వ్యతిరేకమును బేర్కొనియెను గాని తద్భేదములఁ జెప్పలేదు. దండి వ్యతిరేకభేదముల నేడింటిని నుడివెను: 1. ఏకవ్యతిరేకము. 2. ఉభయవ్య. 3. సశ్లేషవ్య. 4 సాక్షేపవ్య. 5. సహేతువ్య. 6. సాదృశ్యవ్య. 7. సజాతివ్యతిరేకము. ఇందు 1, 2, 6, 7 లను రసార్ణవకర్త గ్రహించెను. దండి సాదృశ్యవ్యతిరేకభేదములఁగూడఁ గొన్నిటిని బేర్కొనెను.]
అభావాలంకారము 4 తెఱఁగులు:- 1. ప్రాగభావము. 2. ప్రధ్వంసాభావము. 3. అత్యంతాభావము. 4. కల్పితాభావము. ఇట సంసర్గాభావమే పేర్కొనఁబడినది కాని యన్యోన్యాభావము చెప్పఁబడలేదు. కొందఱు నైయాయికు లీసంసర్గాభావమును బైనాలుగువిధములుగా విభజింతురు. కాని కొందఱు సంసర్గాభావము త్రివిధ మని పైవానిలో మొదటి మూటిని బేర్కొందురు. కల్పితాభావమునకు సామయికాభావ మని నామాంతరము.
ఆగమాలంకారము 4 విధములు:- 1. ధర్మము. 2. అర్థము. 3. కామము. 4. మోక్షము. ధర్మోపార్జనము ప్రవృత్తినివృత్తులచే నగును.
అర్థము 3 తెగలు:- 1. పిత్ర్యము. 2. స్వము. 3. సంచితము.
పిమ్మట నర్థశాస్త్రగ్రంథములు, నర్థశాస్త్రమునందలి దశస్కంధములు పేర్కొనఁబడినవి.