28] గలవు. ఇవి కాక దండికృతియం దీక్రింది వధికముగాఁ గానవచ్చుచున్నవి —
1. స్వభావోక్తి.
2. ఉపమ.
3. రూపకము.
4. దీపకము.
5. ఆవృత్తి.
6. ఆక్షేపము.
7. అర్థాంతరన్యాసము.
8. సమాసోక్తి.
9. ఉత్ప్రేక్ష
10. క్రమము.
11. ప్రేయస్సు.
12. రసవత్తు.
13. ఊర్జస్వి.
14. పర్యాయోక్తము.
15. ఉదాత్తము.
16. అపహ్నుతి.
17. శ్లేష.
18. విశేషము.
19. తుల్యయోగిత.
20. అప్రస్తుతప్రశంస.
21. వ్యాజస్తుతి.
22. నిదర్శన.
23. సహోక్తి.
24. ఆశీస్సు.
25. సంకీర్ణము.
26. భావికము.
దండిభామహు లిరువురు నలంకారములుగా నెంచిన- 1. ప్రేయస్సు. 2. ఊర్జస్వి. 3. ఉదాత్తము. 4. భావికములను మనకవి గుణములుగా మార్చెను. దండిభామహులచే నర్థాలంకారముగాఁ బేర్కొనఁబడిన శ్లేష మనకవిచే శబ్దాలంకారములలోఁ జేర్పఁబడెను. పిమ్మట మనకవి జాతి నర్థాలంకారములలో మొదటిదానినిగా నుడివెను. శబ్దాలంకారములలోఁ గూడ జాతిని మొదటిదానినిగా నీతఁ డెంచెను.
హేతువు 6 విధములు:- 1. ప్రవర్తకము, 2. నివర్తకము. 3. అభావము. 4. జ్ఞాపకము. 5. ప్రయోజకము. 6. చిత్రము.
దండి హేతువు నాలుగువిధము లనియెను. రసార్ణవమునందలి 6 హేతువులలో మొదటి రెండును దక్కఁ దక్కినవి దండికృతిలోఁ జూపట్టుచున్నవి. మనకవి 'ప్రయోజక' మనిన దానిని దండి 'కారక' మనెను. మఱియు నీతఁడు 'జ్ఞాపక-కారకములు' ప్రవృత్తి-నివృత్తులలోఁ జేరుననెను. కారకము - 1. నిర్వర్త్యము. 2. వికార్యము. 3. ప్రాప్యము - అని 3 విధము లనియు, i. దూరకార్యము. ii. కార్యసహజము. iii. కార్యాంతరజము. iv. అయుక్తకార్యము. V. యుక్తకార్యము మొదలుగా 'చిత్రహేతు' వనేకవిధము లనియు దండి నుడివెను. సూక్ష్మము రెండురకము లని దండి యన, రసార్ణవకర్త యాఱువిధము లనెను.