పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


'ప్రాయేణ యమకే చిత్రే రసపుష్టి ర్న దృశ్యతే'

అని మఱియొక సాహిత్యవేత్త యమకచిత్రములు రసపోషకములు గా వనియే నుడివియున్నాఁడు. ప్రకాశవర్షుఁడు మాత్రము యమకము కవిపాండితికి గీటురాయివంటి దని

['కవివ్యుత్పత్తినికషం యమకం నామ తద్విదుః'- 3. పరి. 61.]

చెప్పియున్నాఁడు.

మనకవి ప్రహేలికకుఁ బిమ్మట ననుప్రాసమును [3 పరి. 14.] బేర్కొనియుండినను మనకు లభించినప్రతిలోఁ బ్రహేళిక తర్వాత యమకము చెప్పఁబడినది; అనుప్రాస విడువఁబడినది. అనుప్రాసవివరణభాగ ముత్సన్నమైన దని చెప్పవచ్చును.

యమకభేదముల వివరించునవసరమున ప్రకాశవర్షుఁడు —

'లక్ష్యులక్షణబోధార్థం దిఙ్మాత్రం తు ప్రదర్శ్యతే' - 3 పరి. 64.]

అని చెప్పినను లక్ష్యలక్షణము లిందు మృగ్యములుగా నున్నవి.

గూఢోక్తి 5 విధములు : 1 క్రియాభేదము. 2. కారకభేదము. 3. సంబంధభేదము. 4. పదభేదము. 5. అభిప్రాయభేదములవలనఁ గలుగునవి.

ఈశబ్దాలంకారములు వాగ్దేవికి నవయవాలంకారాదులుగాఁ జెప్పఁబడినవి. ఔచిత్యమును రసమును బాటించుచు సందర్భశోభకై వీనిని గవులు పద్యగద్యముల నుపయోగింపవలయు నని యాతనియభిప్రాయము.

పిమ్మట శ్లేషచిత్రముల ప్రాముఖ్యము, ననుప్రాసా క్లిష్టయమకముల ప్రాధాన్యము వివరింపఁబడెను. బాణునకుఁ బద్యరచనమునకంటె గద్యరచనమునఁ గలయధికకౌశలము, సంసృతప్రాకృతాదిభాషావిచారము, ఆఢ్యరాజ-శ్రీసాహసాంకప్రభువులకాలమునందలి భాషలను గూర్చినవివరములు గలవు. మంచిపుష్పముల నెంచి మాలను గూర్చుమాలాకారునివలెఁ గవి కావ్యశోభాసంధాయకము లగువిషయముల గ్రహించి కావ్యనిర్మాణమును జేయఁదగు నఁట!