ఈ పుట ఆమోదించబడ్డది

రసాభరణ భూమిక

7

నాలోచించినచో భేదము విస్తారముగా నున్న దని 'కార్యారంభేషు సంరంభః స్థేయా నుత్సాహ ఉచ్యతే" మొదలుగాఁ గల వాక్యములను జూచినపుడు తోఁపకపోదు. మఱియు మూఁడవపుటలో విస్మయలక్షణమునఁ 'జేతోవిస్మృతి విస్మయ..." అను పాఠమునే ప్రకాశకు లేల యంగీకరించిరో తెలియదు. "విస్మయశ్చిత్తవిస్తారః పూర్వాదృష్ట విలోకనాత్" మొదలగు నాలంకారికవాక్యములను జూచినచో “విస్తృతి" యనుపాఠమే సరియగు నర్థబోధమునకుఁ దోఁడగు ననియు 'విస్మృతి' యనర్థబోధక మనియుఁ దెలియకపోదు. నాల్గవపుటలో, “నీసమూహంబు రసముల కెల్ల నిట్లు" అనియే యుండ నగును గాని యాదృతమైన పాఠ మనర్థబోధక మని తెలియనగు. పదునొకండవపుటలోఁ జకితలక్షణమును జెప్పు పద్యమునఁ "జూపులు చలింపఁగాఁ గడు" ననుపాఠమునే సహృదయులు గ్రహింపనగు. పందొమ్మిదవపుటలో వ్యాధి కుదాహరణమైన పద్యమునఁ “దరుణి హరి బాళి" యను పాఠమే సొగసైనది. బాళి యనఁగాఁ గాంక్ష. ఇరువదిరెండవపుటలో మొదటిపద్యమునఁ “దగు నాతని కీకపటప్రయోగముల్ " అనుదాన వ్యంజిత మగు నర్థమే యాదృతపాఠము నర్థము కంటె బాగుగనున్నదని సహృదయులు తెలియకపోరు.

ఈ గ్రంథప్రకాశకులు తా మొసఁగిన పాఠములు చెన్నపురి దొరతనమువారి లిఖతపుస్తకభాండాగారప్రతినుండి గ్రహింపఁబడిన వని తెలుపుచున్నారు. అట్టి పాఠములను గ్రహించుట యవసరమే కాని యపపాఠములను బద్యమున నచ్చొత్తించి సరియగు పాఠములను క్రింద గుర్తించుటకై వదలుట న్యాయముగా లేదని నా తలంపు. బీభత్సరసోదాహరణ పద్యమునఁ బ్రకాశకు లాదరించిన పాఠమున కెట్లర్థము చెప్పవలయునో నాకు బోధపడుటలేదు. క్రింద వా రుదాహరించిన పాఠభేదము నంగీకరించిన నేరైనఁ బద్యమర్ధము కాలే దనఁగలరా యని నాకు సందేహము. బహుపాఠముల నిచ్చుట యవసరమే, కాని గ్రంథమున నాదరణీయపాఠము నచ్చొత్తించుటయు నవసరమే యని నా విన్నపము.

ఇంక నొక్కమాట. ఇందును లేఖకప్రమాదములు నచ్చుతప్పులును సంభవించియున్నవి. చూ. “బొదవిననీలవేణియునుబున్నమచందురు నాదరించు నవ్వదనము” ఇత్యాదులు.