ఈ పుట ఆమోదించబడ్డది

దెలుపుటకు రసమంజరి ప్రభృతి గ్రంథములును వెలువడినవి. దర్పణకారుఁడు రసాత్మకమగు వాక్యము కావ్య మని తెలిపి రూపకములను గూర్చిన విషయమును గూడఁ దన గ్రంథమున వ్రాసినాఁడు. నాఁటి నుండియుఁ గూడ గంగానందాదులు రసమును గూర్చియే ప్రత్యేకగ్రంథములను వ్రాసినారు. మఱియు శారదాతనయాదులు భావప్రకాశాదులను గేవల రసవిషయబోధకములను నిర్మించిరి. కనుక మన సాహిత్యశాస్త్రమున నాట్యమును గూర్చియు, నాయికాదులను గూర్చియు శ్రావ్యకావ్యములను గూర్చియు, రసభావాదులను గూర్చియుఁ బ్రత్యేకగ్రంథములు పెక్కులు వెలువడినవి. ఈ సమస్తవిషయసంగ్రహమును గలవియు దర్పణ, ప్రతాపరుద్రయశోభూషణాదులు, బయలువెడలినవి. అట్టులనే తెనుఁగునఁ గూడఁ కేవల రసమును గూర్చి యీ రసాభరణము వెలువడి యుండనగు.

ఈ పైవిషయ మప్రస్తుత మని పలువురకుఁ దోఁపవచ్చును, ఒక దృష్టిని నిది ప్రస్తుతమే యని నా మనవి ఇట్టి గ్రంథము లనేకములు తెనుఁగున నొకప్పుడుండి కాలవశమున మన కప్రాప్తములై మరల నన్వేషణమున లభ్యములు కావచ్చు ననియు నీదృష్టితో వెదకుట యత్యవసర మనియు సహృదయులకుఁ దెలుపుటకే యింత వ్రాసితిమి.

3

ఈ గ్రంథము స్వతంత్ర మైనదో లేక యేసంస్కృతగ్రంథమునకైనఁ బరివర్తనమో తెలియదు. మాతృక కన్పించువఱకు స్వతంత్రగ్రంథమే యిది యని యనుకొనవలెను.

దీనికి 'రసాలంకార'మను నొక పర్యాయనామము కూడఁ గలదని ప్రథమాశ్వాసాంతగద్యమునఁ దెలియఁగలదు. ఆయాయి వ్యాఖ్యలందుఁ బేర్కొనఁబడు రసాలంకార మను సంసృతగ్రంథమున కిది తెనుఁగు సేఁత యేమో యని భ్రమను గొలుపుచున్నది. ఉదాహరణముగా నీవిషయమును దెలుపుచున్నాను. హరవిలాసము శ్రీనాథుని స్వతంత్రగ్రంథమని గదా లోక మనుకొనుచున్నది. హేమచంద్ర కృత కావ్యానుశాసన వ్యాఖ్యానమున 'సుజనదుర్జనస్వరూపం యథాహరవిలాసే' అని కన్పించుచున్నది. ఆవ్యాఖ్యానోదాహృత మగు హరవిలాసము మృగ్యమగుటచే నిపుడు మన మే మనుటకు నవకాశము లేదు. కనుక స్పష్టనిదర్శనము కన్పించువఱకు నీ రసాభరణమును స్వతంత్రగ్రంథమే యనవలయును.