ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పైపయిఁ గ్రమ్మఁ దొట్రుపడుపల్కులఁ దప్పులు దెల్పి చెప్పితి
న్నేపనికైన నోరి నిను నింక సహింపను నొవ్వవ్రేయుదున్.


వ.

మఱి యుత్తమమధ్యమాధమనాయికల తెఱం గెట్టి దనిన—

ఉత్తమనాయిక

క.

సముచితభాషణములఁ గో
పమురీతులఁ దత్ప్రసన్నభావంబుల ను
త్తమమధ్యమాధమాఖ్యము
లమరఁగఁ దెలియునది నాయికాంతర మెల్లన్.


క.

తీపెసఁగఁ బ్రియము లాడును
గోపము వెలి దోఁపనీదు గొనకొని దయితుం
డేపాటిప్రియముఁ జెప్ప మ
హోపప్రశమంబుఁ బొందు నుత్తమసతి దాన్.


ఉత్తమనాయిక వచనము—


ఉ.

వేయునునేల నాకు నరవిందవిలోచన నీదరస్మిత
శ్రీయును నీసుభాషితవిశేషము నీవిలసత్కటాక్షముల్
నీయసమానరూపమును నీమహనీయగుణంబు మన్మనో
నాయక యస్మదీయజననంబు ఫలంబులు గావె యిన్నియున్.


ఆనాయిక కోపము—


చ.

పలుకులఁ జెయ్వులం గమనభంగులఁ జూపుల నేవికారముం
దలఁకొననీక పూర్వగతి దప్పక యున్నవధూటి నిమ్ములం
బిలిచి నిజాంకపీఠమునఁ బెట్టి మఖాబ్జము చూడ బాష్పధా
రలు దెలిపె న్మనోగతనిరంతరకోపముపేర్మి శౌరికిన్.


ఆనాయిక ప్రసన్నత—


శా.

ఏతప్పు న్మును సేయ నిందువదనా యింతేల కోపంబు న
న్నేతన్మాత్రునిగాఁ దలంచితఁటవే యేముట్టెద న్నీపదా
బ్జాతం బంచు నొకింత నమ్రుఁ డయినం బ్రాణేశ్వరు న్నేత్రసం
జాతాంభఃకుచకుంభసంఘటితభాస్వద్వక్షుఁ జేసె న్వెసన్.

మధ్యమనాయిక

క.

మునుకొని ప్రియమును నప్రియ
మును బెరయఁగఁ బల్కుఁ దెల్లముగఁ గోపము చూ
పును విభుని మ్రొక్కు గైకొని
యనుఁగై మఱి తేఱు మధ్యమాంగన ప్రీతిన్.