ఈ పుట ఆమోదించబడ్డది

శాంతమును గూడ తెలిపినాఁడు గదా యని. ఈ విషయమున నాట్యాచార్యుఁడు పూర్వుల మతమును స్వమతానుకూలమనియే “ఏవం నవరసా దృష్టా నాట్యాజ్ఞైర్లక్షణాన్వితాః"అని పేర్కొనెను గావున శాంతముతో నాట్యరసములు తొమ్మిదియని యనంతుని మతమునై యుండునన విప్రతిపత్తి యేమియుఁ గన్పింపదు. ఇతఁడు భరతమును మనమున నిడికొని స్వగ్రంథమును వ్రాసెనా యనుప్రశ్న ముత్పన్నమగుట కేయవకాశము లేదు; కాని, రసాధిదేవతలను బేర్కొనునపుడు బ్రహ్మ యద్భుతరసమున కధిదైవ మని 'అద్భుతో బ్రహ్మదైవతః' అను భరతు వాక్యమునే గ్రహించెను గాని “అద్భుతో విస్మయస్థాయిభావో గంధర్వదైవతః" అను దర్పణకారాది వాక్యములను గ్రహింపమిచే నితఁడు భరతాచార్యు ననుసరించె ననవచ్చును. ఈ యూహను ద్రోసిపుచ్చుయుక్తి తెనుఁగున రూపకములు లేమియే యనవచ్చును. కాని, యిచట మా మనవి యొకటి కలదు. సంసృతము నందు వలెఁ దెనుఁగున లక్ష్యములనుగాఁ జూపుటకు దశరూపకములు, నుపరూపకములును బ్రస్తుత మలభ్యము లనుట నిజమే. ఐనను యక్షగానాదులను బరికించినచో రూపకోపరూపకము లొక కొన్ని మన తెనుంగు బాసను గూడఁ గల వని నిర్ధారింపనగును. ఆదృశ్యములను బండితులైన కవులు వ్రాసిరా యనఁగూడదు. నారికేళపాకమున నజచరిత్రమును వ్రాసి రాజాస్థానములఁ బండితులతో వ్యాకరణాది శాస్త్రముల శాస్త్రార్థము లొనర్చి పెక్కుజయములు గొన్న మతుకుమల్లి నృసింహవిద్వత్కవి సుమారు వందయేండ్లలోగా నివసించినవాఁడు శ్రీకృష్ణజలక్రీడ లను నొక నాటకము నతిమృదుశైలిని రచించినాఁడు. కావున రూపకముల ధోరణుల కనువగు మార్గమున రసస్వరూపము నితఁడు తెలిపి యుండవచ్చును.

ఇఁక నొక్క యూహ. అనాది నుండియు నాట్యశాస్త్రము వేఱుగాను, శ్రవ్యకావ్యములకు సంబంధించి యలంకారశాస్త్ర మని వాడఁబడు సాహిత్యశాస్త్రము వేఱుగాను దర్పణకారుని వఱకుఁ బరిగణింపఁబడినయవి. రూపకములకుఁ బ్రధానమైనది రస మనియు, శ్రవ్యములకుఁ ప్రధానమైనది ధ్వని యనియుఁ బలువురు చెప్పిరి. ఆధ్వనియందు భేద మగు నసంలక్ష్యక్రమ మనుదానియందు రసాదులు పేర్కొనఁబడినవి. అందుచేతనే కావ్యప్రకాశము ధ్వన్యాలోకము మున్నగు గ్రంథములయందు రూపకప్రకరణమే లేదు. రూపకములను దెలుపుటకు దశరూపకాది గ్రంథములును, నాయికాది భేదములను