ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాసవసజ్జిక—


క.

హరిరాకకు నిచ్చలు మం
దిర మొప్ప నలంకరించు దేహమునం గ
స్తురి సురతరుకుసుమంబులు
సిరసునఁ దగ సత్యభామ చెలువగుచుండున్.


క.

విరహోత్కంఠిత యనునది
వరునితడవు సైఁపలేక వగనొందు నధీ
శ్వరుఁ డిక్కకు రాకుండిన
భరపడునది విప్రలంభ భావజుచేతన్.


విరహోత్కంఠిత—


క.

మంద కడుదూర మాగో
విందుఁడు రాఁడేల యనుచు విరహాతురతం
బొంది యొకగోపకామిని
చందురుఁ బ్రార్థించుఁ బ్రాణసఖులం దలఁచున్.


విప్రలబ్ధ—


క.

సంకేతస్థలమునకుం
బంకజదృశుఁ డేలరాఁడు భయభీతుల నే
వంకఁ గరుణింపఁబోయెనో
యింకేమన నన్నుఁ దలఁపఁడే మదనార్తన్.


క.

ఇతర దెస రాత్రి రతిచి
హ్నితుఁడగుపతి ఱేపుగని సహింపనియది ఖం
డితయగుఁ గలహాంతరి తన
పతి నవమానించి పిదపఁ బరితప్త యగున్.


ఖండిత—


క.

మనసిజశరహత మగు నా
మనసది నీ కెఱుఁగరాదు మాధవ యీరే
నను సోఁకిన మదనాయుధ
తనువ్రణముల నిపుడె చూపెఁ దాపము చాలన్.


కలహాంతరిత—


క.

కోపించి జనార్దను నే
లా పల్కితి నపుడు వీనులకు నహితముగా
నోపడఁతి యిపుడు మదనుని
కోపము సైరింప నాకు గోచర మగునే.


క.

ఒకదేశమునకుఁ దననా
యకుఁ డేగినఁ జిన్నవోవునది ప్రోషితభ
ర్తృక నిలుపోపక ప్రియనొ
ద్దకుఁ జను నభిసారికాభిధాన తలంపన్.


ప్రోషితభర్తృక—


క.

మధురకు నేగెం జెలియా
మధుమర్దనుఁ డింక నేఁడు మగుడుట యెపుడో
మధుమాసకీరకోకిల
మధుకరతతు లేపురేఁగి మదనుని గూడెన్.


అభిసారిక—


క.

అందెలు దొడిగితి నీవు ము
కుందునియున్నెడకు నరుగఁగోరి లతాంగీ
పొం దెఱుఁగవే కదా నీ
కుం దెరువున నివియ తోడికొండీలు సుమీ.