ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పరకీయకు నుదాహరణము—


ఉ.

వేసరఁ డిందు రాఁదొడఁగె వెన్నుఁడు నీవును నమ్మురారిపైఁ
జేసితి కూర్మి మాను మని చెప్పితిఁ జిల్కకుఁబోలొ నెప్పుడున్
గాసి యొనర్చితే కుడువఁ గావిగొనం బడపెల్ల మాని నీ
వాసరసీరుహాక్షునకు నాలవుగా దొరకొంటె కూఁతురా.


క.

మున్నొకని యధీనము గా
కున్న రమణి నొరు లెఱుంగకుండ రమించున్
మిన్నక యెవ్వఁ డతని కా
కన్నియ పరకీయయట్లకా నెన్నఁబడున్.


ఉదాహరణము—


ఉ.

కన్నియ నేను నన్నుఁ దమకంబున నేటికిఁ గొంగువట్టె దా
సన్నఘనక్షమాజముల చక్కిఁ జరించెద రల్లవారె మా
యన్నలు మానుమాను మని యల్లనఁ బల్కఁగ బుజ్జగించుచు
న్వెన్నుఁడు గోపకామిని నవీనసుఖాంబుధిఁ దేల్చె నేర్పునన్.


క.

తొలితొలి ముగ్ధ యనంగా
నలరిన మధ్యమ యనంగ నటఁ బ్రౌఢ యనం
జెలువగు యౌవనవయసునఁ
గలిగిన సంకేతనాయికలు మువ్వు రొగిన్.


ముగ్ధ కుదాహరణము—


మ.

హరిఁ జూచెం దరుణీలలామ నతవక్త్రాంభోజ మొప్ప న్సుధా
కరరేఖం బురణించుఫాలమున రంగద్భృంగసంఘాకృతిం
గురులాడం గ్రముకంబుల న్మిగుల వక్షోజాతముల్ వ్రీడయం
దెరలో నిల్చు సువర్ణపుం బ్రతిమభాతి న్ముగ్ధభావంబునన్.


మధ్య కుదాహరణము—


మ.

నడ పొప్పు న్మురిపంబుతో నయనకోణంబు ల్మెఱుంగెక్కఁగా
నొడువు ల్దేనెల నీనఁగా నులియఁ గౌనుందీఁగె చన్దోయి మా
రెడుపండ్లం దెగడంగ నంగన మురారిం జూచెఁ బ్రేమంబు గ
ప్పెడు సిగ్గు న్మఱి సిగ్గుఁ గప్పెడు మనఃప్రేమంబు సంధిల్లఁగాన్.