ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

రసాభరణము

చతుర్థాశ్వాసము

క.

శ్రీనాయకుఁ డఖిలధరి
త్రీనాయకుఁ డగ్గణాదితేయమునిశ్రే
ణీనాయకుఁ డీధ్రువనగ
రీనాయకుఁ డెలమి నాదరించును మమ్మున్.


వ.

నాయకప్రకరణం బెట్టి దనిన, నాయకత్వంబు ప్రధాననాయకులు, సర్వ
రససాధారణనాయకులు, కేవలశృంగారనాయకులు, ననంగాఁ ద్రివిధం
బై పరఁగె నందు బ్రధాననాయకుండు కావ్యాలంకారవ్యక్తుండు గావున
నట్లుండె నున్న యిరుదెఱంగుల వివరించెద.

సాధారణనాయకులు

క.

ఎలమి నుదాత్తోద్ధతు లన
లలితుఁడు శాంతుండు నాఁ గలరు నాయకు లి
మ్ముల ధీరపూర్వు లనువా
రలు నలువురు వారు సర్వరససామాన్యుల్.


అందు ధీరోదాత్తుఁడు—


క.

భూరికృపామృతరసవి
స్తారుఁడు ధీరుఁ డతిసత్త్వధనుఁడు మహాగం
భీరుఁ డధికధనుఁ డనఁగా
ధీరోదాత్తుండు సంస్తుతికిఁ బాత్రుఁ డిలన్.


ఉదాహరణము—


క.

తనుఁ బొగడ సహింపఁడు శ
త్రుని నైనం దెగి వధింపఁదొడఁగఁడు ముదముం
గినుకయుఁ దోఁపఁగనీఁ డా
ననమునఁ గీర్తిసుభగుం డొనర రఘుపతిదాన్.


ధీరోద్ధతుఁడు—


క.

సులభక్రోధుఁడు మాయా
జలనిధినావికుఁడు దర్పసామర్థ్యయుతుం
డిలఁ జండవృత్తుఁ డనఁగా
వెలయును ధీరోద్ధతుండు విపులస్ఫూర్తిన్.


ఉదాహరణము—


క.

రక్కసులు మీరు మీకును
రక్కసులై నిలిచి రిపుడు రామునిబంటుల్
చిక్కితిరి పొండనుచుఁ గపు
లక్కజముగఁ గెడపుదురు దశాస్యునిబంట్లన్.


ధీరలలితుఁడు—


క.

వివిధకళానిపుణుఁడు సుఖ
నివహంబులతానకంబు నిశ్చింతుఁడు నా
నవనిఁ బచరించునాతఁ డ
లవునం బొగడొందు ధీరలలితుం డనఁగన్.