ఈ పుట ఆమోదించబడ్డది

మునఁ “గావ్యంయశసే౽ర్థ కృతే వ్యవహారవిదేశివేతరక్షతయే సద్యఃపరనిర్వృతయే కాంతాసమ్మితతయోపదేశయుజే" యను మమ్మటాచార్యుఁడు నుడివిన కావ్యప్రయోజనమునే,

“సకల విద్యలయందుఁ జర్చింపఁ గవిత యుత్కృష్టమండ్రది నిత్యకీర్తికొఱకు, నర్థాప్తికొఱకు, నా వ్యవహారలక్షణం బెఱింగెడుకొఱకు, ననేకవిధములగు నమంగళముల హరియించుకొఱకు, నుచితనిత్యసౌఖ్యసంసిద్ధికొఱకు, నొనరఁ గాంతాసమ్మితోపదేశమ్మునఁ బ్రీతిమై హిత మాచరించుకొఱకు, నయ్యెఁ గాన.........

అని నుడివినాఁడు. సాహిత్యశాస్త్రగ్రంథములను బరిశీలింపఁ గావ్యమున కాత్మ రసమని మొదట నొడిచినవాఁడు క్రీ.శ. 13-5 ప్రాంతమున భారతభూమి నలంకరించిన సాహిత్యదర్పణకారుఁ డైన విశ్వనాథకవిరాజే. వారిమతమున కనువుగ రసాభరణమును దెనుఁగున వ్రాసిన యనంతామాత్యుఁడు విశ్వనాథుని దర్పణమును మమ్మటుని కావ్యప్రకాశమును గూడ మేలవించి యెం దే విషయము ప్రశస్తమైనదో దాని నెల్ల గ్రహించినాఁ డనవచ్చును.

ఇంతియ కాదు. ఇంకొక యూహము పొడము వచ్చును. ఇతఁడు కేవలము రసమును గూర్చియే యీ గ్రంథమును వ్రాయుట వలనను, దక్కిన గుణ, దోష, ధ్వన్యలంకారాదులను వివరింపకపోవుటచేతను దృశ్యకావ్యప్రశంసయే మనమునం దిడికొనినాఁ డేమో యనవచ్చును. రసము నాట్యమునకు ముఖ్యముగా సంబంధించినది గాని శ్రవ్యకావ్యములకు ముఖ్యము కా దని పలువుర పూర్వాలంకారికుల మత మనునది యే యీకవికిని నచ్చినదేమో. కావ్యకౌతుకమునఁ ‘బ్రయోగత్వ మనాపన్నే కావ్యే నాస్వాద సంభవః' అని యున్నదని యభినవగుప్తుఁడు చెప్పి “కావ్యం తావ న్ముఖ్యతో దశరూపాత్మక మేవ ... నాట్యే ఏవ రసాః నలోకే। కావ్యం చ నాట్యమేవ।” యని తన యభిప్రాయమును నుడివి “నానాభావాభి వ్యంజితాన్ వాగఙ్గసత్వోపేతాన్ స్థాయిభావా నాస్వాదయన్తి సుమనస్యప్రేక్షకాః హర్షాదీంశ్చాధిగచ్ఛన్తి, తస్మాన్నాట్యరసా ఇత్యభివ్యాఖ్యాస్యామః" యను భరతాచార్యుని వాక్యమును బ్రమాణీకరించెను. ఈభరతవాక్యమే యనంతామాత్యునకుఁ బ్రమాణమై యీగ్రంథమును రచించుటకుఁ బురికొల్పిన దేమో. ఈ యూహ కాదనుట కొకసందేహము కలుగవచ్చును:———ఇతఁడు నాట్యరసములు నెనిమిదింటినే తెలుపక