ఈ పుట ఆమోదించబడ్డది

మగు నొక ఛందోగ్రంథమును, గవితకుఁ బ్రాణ మనఁ దగు రసము స్వరూపమును వెల్లడించుటకై రసాభరణమును గూడ రచించినాఁడు.

ఇతఁడు తా నాఱువేలనియోగి బ్రాహ్మణవంశమువాఁడ నని సగర్వముగా నీ క్రిందివిధమునఁ జెప్పికొనినాఁడు.

“ఈ యార్వురు నొక్కొక్కఁడు, వేయిండ్లకు మొదలుగాఁగ వెలయుదురని కాదే యాఱువేలపే రిడి, రీ యన్వయమునకు నేష్య మెఱిఁగిన పెద్దల్”


ఇతఁడు కృష్ణాతీరమువాఁడు. తండ్రి "శ్రీకాకుళంబున కొడయఁడైన యంధ్రవల్లభ హరిసేవనలరుచుండు"వాఁ డని వర్ణింపఁబడినది. రసాభరణము ధ్రువపురీశున కంకితము చేయఁబడిన దని కవి తెల్పుచున్నాఁడు. ఈధ్రువపురి ప్రస్తుతము గుంటూరుమండలమునఁ గృష్ణాతీరప్రాంతమునఁ గల ధూళిపూడి యను గ్రామమా యని యూహ పొడముచున్నది.

భారతకవియగు తిక్కయజ్వకు శిష్యుఁడును దిక్కనయనువాని పుత్రుఁడు నగు మారనయు నితనివంశ్యుఁ డేమో యని సందేహము పొడముట కవకాశము గన్పట్టుచున్నది. తిక్కయజ్వచే భవ్యభారతి యను బిరుదము నందిన బయ్యనమంత్రికిఁ బినతండ్రియగు త్రిపురాంతకుని యారుగురు కొమరులలోఁ జివరవాఁడు ప్రశస్తసాహిత్యుఁడు తిక్కన కలఁడు. వానికి సమకాలికుఁడే తిక్కయజ్వ. ఆతిక్కన కుమారుఁడు విద్యాభ్యాసము చేయువాఁడై కవితాసామ్రాజ్యపట్టభద్రుఁడైన తిక్కనను శుశ్రూషఁ జేసినాఁడన నూహకు లోపముండదు. కాని, యిందలి యథార్థమును బెద్దలు నిర్ణయింతురుగాత మని యీప్రస్తుతముగాని విచారణ నింతతో వదలుచున్నాను.

ఇప్పటికిఁ గవిని గూర్చి మనకుఁ దెలిసిన చరిత్రాంశములు:- ఇతఁడు కౌండిన్యగోత్రుఁడగు నియోగి; కృష్ణాతీరవాసి; విద్వత్కవివంశమువాఁడు; భోజరాజీయ మను ప్రబంధమును, ఛందోదర్పణ మను లక్షణగ్రంథమును, రసాభరణ మను కావ్యలక్షణగ్రంథమును జెప్పినాఁడు; క్రీ. శ. 1435 ప్రాంతమున నున్నవాఁడు.

2

తెనుఁగు బాసను గావ్యము లక్షణము లాదిగాఁ గల వానిని విచారించు సాహిత్యశాస్త్రము లతిస్వల్పముగా నున్నవి. ఇప్పటికి వెల్లడి యైనవానిలో రసాభరణమే ప్రాచీన మనఁదగి యున్నది. ఈ కవి తన భోజరాజీయ