ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఖ్యాతసుఖాదులవలనఁ బ్ర
జాతం బగురోమవితతి సరభసముగఁ బ్ర
ద్యోతించిన నది విద్యా
[1]న్వీతులు రోమాంచ మని గణింతురు ప్రీతిన్.


.శ్రమరతిఘర్మాదులచే
విమలశరీరములయందు విస్ఫుట మగు న
చ్చెమటకు నభిదానము స్వే
దముగాఁ బల్కుదురు సమ్మదమున నభిజ్ఞుల్.


రోమాంచస్వేదంబుల కుదాహరణము—


క.

మనసున హరి నాలింగన
మొనరింపఁగఁ బోలుఁ బులక లొదవె నతివకుం
జననీక యతివఁ గైకొని
పెనఁగుటఁ గాఁబోలు ఘర్మబిందువు లెసఁగెన్.


క.

మదరోషవిషాదాదుల
నుదయించిని పాండురత్వ మొగిఁ బ్రస్ఫుట మై
వదనమునఁ దేటపడునే
నది వైవర్ణ్యంబుపేర నలవడి యుండున్.


క.

మోదమున నేని రోషభ
యాదుల నేనియును గంప మధికంబగుఁ దా
నేదేహిదేహమున నది
[2]మేదిని వేపథు వనంగ మెఱయుచునుండున్.


వైవర్ణ్యవేపథులు రెంటికి నుదాహరణము—


క.

శ్యామసమంచితమేఘ
శ్యాముని దలఁపంగ నేమిచందమొకో నె
మ్మోము గడు వెల్లనయ్యెను
గాముఁడు జంకింపకున్నెఁ గంపము గదిరెన్.


క.

సంతోషరోషదుఃఖా
క్రాంతస్వాంతులకుఁ బొడము కన్నుల నీళ్ళుల్
చింతింప నశ్రులని వ
ర్ణింతురు భావవిదు లగుమనీషులు కృతులన్.


క.

ఆనందాదులవలనం
గానంగా నైనయట్టి గద్గదభాషి
త్వానూనత వైస్వర్యా
ఖ్యానంబున నుల్లసిల్లు నాగమసరణిన్.


అశ్రువైస్వర్యంబులు రెంటికి నుదాహరణము—


క.

ఎం దరిగితి కృష్ణుఁడ నా
[3]డెందము గరుపొడిచి తన్ను డీకొనునశ్రుల్
డిందించుకొనుచుఁ బలుకఁగఁ
గందర్పుఁడె తెలు దానిగద్గదభాషల్.


క.

ప్రణుతము లగుసాత్వికల
క్షణముల నిటుచెప్పి యింక సంచారికల
క్షణములు ముప్పదిమూఁడును
గణుతించి సలక్షణముగా నొనరింతున్.


వ.

అవి యెయ్యవి యనిన నిర్వేదగ్లాని శంకాసూయా మదశ్రమాలస్యదైన్య
చింతామోహస్మృతిధృతి వ్రీడాచపలతాహర్షావేగజడతాగర్వవిషా
దౌత్సుఖ్య నిద్రాపస్మారసుప్తిప్రబోధామర్షావహిత్థోగ్రతా మతివ్యాధ్యు
న్మాదచరమత్రాసవితర్కంబులు ముప్పదిమూఁడును సంచారికాభావములు.

  1. స్ఫీతులు రోమాంచ మని రచింతురు
  2. మేదినిపైఁ గంప మనఁగ
  3. డెందము గురుపొడిచి తన్నెదుర్కొనునశ్రుల్