ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కిలికించితమున కుదాహరణము—


క.

వనజముఖి కమరె బృందా
వనమున నేకతమ వల్లవప్రభుఁడు ప్రియం
బునఁ గొంగువట్టఁ[1] గంపిత
తనువున బొమముడియు గద్గదస్వరము నొగిన్.


క.

పతి దడవఁగ నుదయంబగు
సుతనూరుహసమితి భావసూచక మయ్యెన్
రతిసమ్మర్దమున నపరి
మితసౌఖ్యము కలిమి కుట్టమితఁ మనఁ బరఁగెన్.


భావసూచకమున కుదాహరణము—


క.

శౌరికథాశ్రవణసుధా
సారంబున నలరియును వ్రజశ్రీ యొప్పెన్
శారీరవంచనంబున
వారింపఁగనేర రవయవంబులఁ బులకల్.


కుట్టమితమున కుదాహరణము—


క.

కసమసతో హరి గవయుటఁ
గుసుమశరాంకములు సఖికి గొండించిన సి
గ్గెసగఁగ నమ్రానన యై
వసుధాతల మిందువదన వ్రాయుచు నుండెన్.


క.

వరునిప్రసంగమున ననా
దర మిది బిబ్బోక మనఁగ ధారుణి నెగడున్
భరితసుకుమారగాత్రాం
తరవిన్యాసంబుపేరు దా లలిత మగున్.


బిబ్బోకమున కుదాహరణము—


ఉ.

ఆతతసంపదాఢ్యుఁ డగునంతియకాదు వదాన్యుఁడౌ జగ
జ్జాతసముల్లసద్భరణశాలిభుజాపరిఘుండు నౌ కళా
స్ఫీతుఁడు నౌ మురారి యని చెప్పఁగనేల ప్రియోక్తు లల్పమా
దూతిక చాలుఁ జాలు[2] మరుతూపులు దాఁకినఁ దాఁకనీ తుదిన్.


లలితమున కుదాహరణము—


మ.

మొలనూ లున్నవరత్ననూపురముల్ మ్రోయం బదన్యాసలీ
లలు చేవీచినఁ గంగణక్వణనజాలం బొప్పు నుద్యన్మృదూ
క్తు లొనర్పన్ దరహాసచంద్రికలు నిక్కున్ గోపకృష్ణాంతికో
జ్జ్వలదాభీరవధూలలామల విభాస్వద్రూఢి యిం తొప్పునే.


క.

ఆపోవక ప్రియుఁ జూచెడి
చాపలము కుతూహలంబు శశిముఖి భీతిం
జూపులు పచరింపఁ గడుం[3]
జూపట్టుట చకిత మనఁగ సొంపు సెలంగెన్.


కుతూహలమున కుదాహరణము—


క.

హరి గరుడారూఢుండై
యరుదేరఁగఁ జూచుటకు రయంబున సతు లె
క్కిరి హర్మ్యములు విమాన
స్ఫురితసురాంగనలతోడఁ బురణించుగతిన్.

  1. గొంగుముట్ట
  2. చాలుఁదోలు
  3. జూపులు చలింపఁగాఁ గడుఁ