ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దలఁపు నిలుప[1] రసాశ్రయత్వంబు గలుగు[2]
ననుకరణమాత్రమై యుండు నాశ్రయంబు
గాదు, భావకత్వాదులు గలిగెనేని
వాఁడు సామాజికులయట్టివాఁడ యపుడు.


క.

ప్రకటనటుఁ డరయ సామా
జకసముఁ డగునేని వానిచే ననుభావా
దిక మె ట్లొదవు ననిన వా
నికి నిది యభ్యాసజనితనిపుణత యయ్యెన్.


ఉ.

వాసన నొప్పుప్రేమ మిరువంకల లే కొకవంకఁ జెప్పిరే
నేసతియైనఁ బల్వురకు నిచ్చయొనర్చుటఁ జెప్పిరేని త
ద్భాసురలీల మ్లేచ్ఛమృగపక్షిగతంబుగఁ జెప్పిరే రసా
భాసముగా నెఱుంగుదురు భావకు లీత్రివిధప్రయోగమున్.


వ.

అందును—


క.

అరయ సంజ్ఞాప్రకరణ
మీరీతిఁ దనర్చి వెలయు నిట రత్యాది
స్ఫారప్రకరణమును శృం
గారప్రకరణము నాయకప్రకరణమున్.


క.

నవరసనాథశ్రీనిధి
నవఖండమహీతలంబునకు నొడయఁ డొగిన్
నవనలినాసనజనకుఁడు
నవనిధిసదృశుండు సజ్జనవ్రజమునకున్.

గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ సుకవిజన
విధేయ అనంతనామధేయ ప్రణీతం బైన రసాలంకారంబునందు[3]
నవరసస్థాయిభావంబులును సజాతీయవిజాతీయంబులును
విభావానుభావసాత్త్వికభావసంచారికాభావంబులును
రసజన్మరసవిరోధాదులును సంజ్ఞాప్రకర
ణంబు నన్నది ప్రథమాశ్వాసము.

  1. నిలుపు
  2. గలదు
  3. రసాభరణ మని వాడుకలోను గ్రంథాదిని గలదు.