ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్

భూమిక

1

తిక్కన కొమరుఁ డగు ననంతామాత్యుఁ డీ రసాభరణమును రచించెనని యిందుఁ గల గద్యమునఁ గలదు. ఈ గ్రంథమునకుఁ దుదఁ గల “జానొందన్ శకవర్షముల్" అను పద్యమును బట్టి లెక్కించుచో నితఁడు రసాభరణమును క్రీ. శ. 1435 జనవరిలో దేవాంకిత మొనర్చినటుల నిర్ధారింపనగును. ఈవిషయమును బట్టి యీతనికాలమును నెల్లరును నిర్ణయించుకొనఁగలరు.

ఇతని తండ్రి తిక్కన భారతమును జెప్పిన కొట్టరువు తిక్కయజ్వ కాఁడు. ఈసంగతి నీతఁడు రచించిన భోజరాజీయమునఁ దనకు ముత్తాత యైన బయ్యనమంత్రిని వర్ణించిన పద్యము వలన స్పష్టపడును. ఆపద్య మిది: —

క్షితిఁ గ్రతుకర్తృతామహిమఁ జేకొని పంచమవేదమైన భా
రతముఁ దెనుంగుబాస నభిరామముగా రచియించి నట్టి యు
న్నతచరితుండు తిక్కనకవినాయకుఁ డాదట మెచ్చ భవ్యభా
రతి యనఁ బేరుఁ గన్న కవిరత్నము బయ్యనమంత్రి యల్పుఁడే.

ఈ గ్రంథకర్త కౌండిన్యగోత్రుఁడు. ఇతని ముత్తాత కవిబ్రహ్మ యగు తిక్కన వలన భవ్యభారతి యనిపించుకొనియెను. ఈ బయ్యనకుఁ బినతండ్రి యగు త్రిపురాంతకుని కుమారులలో నొకఁడగు తిక్కన "ప్రశస్తసాహిత్యుఁడ”ని భోజరాజీయముననే తెలుపఁబడినది. తన యన్నదమ్ములను గూర్చి తెలుపు నీ పద్యమునఁ దన తమ్ముఁడు చిట్టనసత్కవి యని తెలిపినాఁడు గ్రంథకర్త.

భూనుతకీర్తి ముమ్మడివిభుండు మదగ్రజుఁ డేను వైష్ణవ
ధ్యానసమాహితాత్ముఁడ ననంతసమాఖ్యుఁడ నాదు తమ్ము ల
జ్ఞానవిదూరు లక్కనయు, సత్కవి చిట్టనయున్, వివేకవి
ద్యానిధి రామచంద్రుఁడు, నుదారుఁడు లక్ష్మణ నామధేయుఁడున్.

వీనిని బట్టి చూడఁగా వీరి వంశము కవితావంశ మనఁ దగి యున్నది. ఇట్టివంశమున జనించినవాఁ డగుటనే యితఁడు పద్యరచనకుఁ బ్రథమసోపాన