ఈ పుట ఆమోదించబడ్డది


క.

మేదోమాంసాసృక్శ
ల్యాదివివిధదుష్టదర్శనాదులవలనం
బ్రాదుర్భవించుహేయం
బేది యది జుగుప్స యనఁగ నెన్నికకెక్కున్.

—జుగుప్స కుదాహరణము—

ఉ.

చిక్కిరి నేఁడు రక్కసులు సీ బలభద్రునిముష్టిఘట్టనం
బుక్కిటిమద్యమున్ రుధిరపూరము నొక్కటిగా బుగుల్కొనం
గ్రక్కుచు సీరధారఁ దెగి కండలు గుండెలుఁ గీకసంబులుం
దక్కక చిక్కుజీరువడి దగ్గఱ రాలిపెఁ బూతిగంధమున్.


క.

క్షితిఁ గారణంబుకంటెను
వ్యతిరిక్తం బైనయట్టి యభినవకార్య
స్థితిదర్శనచేతోవి
స్మృతి[1] విస్మయ మనఁగ నుల్లసిల్లు ముకుందా.

—విస్మయమున కుదాహరణము—

చ.

కొడుకఁడ వైననీకు నిదె కొమ్మనుచున్ సెలవిం గరాంగుళం
బిడి భువనప్రపంచము లనేకము లంగిటఁ గాంచె నందులోఁ
గొడుకున కుగ్గువెట్టు తనకోమలరూపము నొప్పఁగాంచి య
ప్పడఁతి యశోద నివ్వెఱఁగుపాటు వహించె మనోగతంబునన్.


క.

ఎరవగు[2] సంసారం బ
స్థిరముగఁ గని నిర్వికారచేతనుఁ డగు న
ప్పురుషుని సుఖదుఃఖాద్య
స్మరణము లోకంబునందు శమమై చెల్లున్.

—శమమున కుదాహరణము—

చ.

కటకట! రాజ్య మంత్యనరకం బటె దేవపదంబు లన్నియుం
గుటిలనిశాటభర్జనలకు న్సదనం బటె యింక సౌఖ్య మే
మిటఁ గల దంచు సర్వమును మిథ్యగఁ జూచు బుధాళిలోని సం
కటములు బాహ్యదుర్దశలుఁ గ్రాఁగు గదాధరరక్షణంబునన్.


క.

స్థాయిత్వం బీభావని
కాయంబున కేమిట న్విఘాతము లేకు
చ్ఛ్రేయమగు వెండి యేమిటఁ
బాయక తలకొను రసానుభవ మనిరేనిన్.


వ.

స్థాయిభావములు సజాతీయ విజాతీయంబులం జెడక దృఢవిభావ సదమలానుభావ సాత్త్వికభావ సంచారికభావముల రసములై వర్తించు
నందు సజాతీయ విజాతీయభావము లెట్టి వనిన.


క.

అరయ సజాతీయములై
జరగు నిజస్థాయిభావజనితాంతరముల్
సొరిది విజాతీయములై
జరగుఁ బరస్థాయిభావజనితాంతరముల్.

  1. విస్తృతి
  2. ఇరవగు