ఈ పుట ఆమోదించబడ్డది


క.

విధివశమునఁ దనప్రజకగు
నిధనాదులు వినినఁ దనదు నెమ్మనమున న
త్యధిక మగు నెగులు వొడమిన
నధీరమతిఁ బొగుల శోక మపగతశోకా!

—శోకమున కుదాహరణము—

ఉ.

అన్న! సభాస్థలంబున దురాత్మకులై తలవట్టి యీడ్చి రం
దున్న ప్రభుల్ గనుంగొనఁగ నొల్వఁ దొణంగిరి చీర శూరులు
న్నన్ను నుపేక్ష చేసిరి యనాధఁ జుమీ కరుణింపు దిక్కు నీ
వన్న వధూటిమాట విని యక్షయ మంటివి నెత్తమాడుచున్.


క.

ఏపున నితరులద్రోహా
లాపాదులు తనదువీనులన్ సోఁకినచో
నేపురుషునిమదిఁ బొదలుఁ బ్ర
కోపజ్వలన మరి నెగడఁ గ్రోధ మనంగన్.

—క్రోధమున కుదాహరణము—

ఉ.

తిట్టులు పెక్కు సైఁచితి మతి న్మనుజాధముఁ డేల క్రొవ్వెనో
యిట్టులు ధర్మరాజుసభ నెగ్గులు వల్కిన దైత్యకోటి ము
ప్పెట్టులఁ దూలఁదోలు మదభీప్సితదర్శన మీసుదర్శనం
బెట్టులు సేయునో యిచట నిందఱుఁ జూతురుగాక చైద్యునిన్.


క.

లోకోత్తరకృత్యంబులు
గైకొని యవి [1]యెడపకుండఁ గావించు దృఢా
స్తోకప్రయత్న మది సుగు
ణాకర యుత్సాహ మనఁగ నభినుతి నొందున్.

—ఉత్సాహమున కుదాహరణము—

ఉ.

బాణునిఁ గాతునంచుఁ బటుబాహుబలంబున నడ్డగించి యా
స్థాణుఁడు దానునుం బ్రమథసంఘముఁ బన్నినఁ బన్ననీ రణ
క్షోణిఁ బరాక్రమస్ఫురణ సూపెద శత్రుని యేపు మాపెదన్
శోణితపట్టణంబు వెసఁ జొచ్చెదఁ ద్రుంచెద దైత్యుహస్తముల్.


క.

ఘోరము లగునత్యుగ్రా
కారాదులవలన మనసు కళవళపడఁగా
సైరింపరాక తూలుట
యారయ భయ మనఁగ నెగడు నభయవిధాయీ.

—భయమున కుదాహరణము—

ఉ.

మించుగఁ బాచజన్య మెలమిం గరపద్మయుగంబునందుఁ గీ
లించి నిజాధరోష్ఠమున లెస్సగఁ గూర్చి మురారి లీనఁ బూ
రించిన గుండియ ల్వగిలి ద్రెక్కొను భీతి నశేషదైత్యులుం
జంచలచిత్తులై నలుదెసం జెడి పాఱిరి తద్ఘనధ్వనిన్.

  1. యడపకుండ