ఈ పుట ఆమోదించబడ్డది

రసాభరణము.

ఈ గ్రంథము పరిషత్తునకుఁ జాలకాలముక్రిందటనే కాకినాడ సమీపమునం దున్న కుయ్యేరు గ్రామనివాసులు బ్ర॥ హరిసోమయాజుల సుబ్బరావుగారు పంపినది. క్రోధన సం॥ ఆషాఢ బ 8 శుక్రవారమున శృంగారకవి వెంకయ్యగారు వ్రాసినది. పరిషత్పుస్తకభాండాగారములో సంఖ్య 1781 గలదిగా నున్నది. తాళపత్రపతి. దీనిని, చెన్నపురిలో దొరతనమువారి పుస్తకభాండాగారములోని రెండుప్రతులతో సరిచూపించితిమి. ఆరెంటిలో నొకటి కాగితప్రతి. రెండవది తాళపత్రపతి. అందు నిందును గూడ గృత్యాదిని బద్యములు లేవు. కవి యట్లే ప్రారంభించెనా యనఁజాలము. కొన్ని సందేహములును లేఖక ప్రమాదములును నెందును దీఱలేదు. ఒక విధముగా నీ ప్రతిని లోకములో విడిచినారము. ఎవ్వరియొద్ద నైనఁ బూర్ణగ్రంథ మున్న వారు తప్పులు సవరణలుఁ దెలిపినచో ద్వితీయముద్రణ మింతకంటెఁ బరిశుభ్రముగాఁ జేయింపఁదలఁచుచున్నారము. సంపూర్ణప్రతి నిర్దుష్టమైనది ముందు దొరకునను నూహలో నిపుడు స్వల్పప్రతులే ముద్రింపించినారము.

ఈపుస్తకమునకు భూమిక వ్రాసియిచ్చి మాకు సాయపడిన విద్వాన్ కోపల్లె శివకామేశ్వరరావుగారియెడల మేమెంతయుఁ గృతజ్ఞులము.

ఆం. సా. ప.