మిథ్యాపవాదంబు మిన్నకయున్నఁ, దథ్యమైనట్లుండు ధనరలోన ననుచు
నినకులాధీశ్వరుఁ డీతెంపు సేయఁ, బనిచినాఁ డటు గానఁ బరమానురక్తి
మునిపత్నులార యీముద్దియ మీరు, కొనిపోయి మన్నించుకొని యుండఁదగును
వగవకుండఁగ నెమ్మి వర్తింపుఁ డనిన, నగుఁగాక యని మ్రొక్కి యాతపస్వినులు
ధరణిజఁ దోడ్కొంచుఁ దమనివాసముల, కరిగి యద్దేవికి నధికమోదమున
నుచితోపచారంబు లొనరించుచుండ, నచట వాల్మీకియు నర్థితో నుండె
విచారించులక్ష్మణునకు సూతుఁడు దేవరహస్యముం జెప్పుట
నంత నయోధ్యకు నరవంబు చనఁగఁ, జింతాపరంపరం జెంది లక్ష్మణుఁడు
నాసుమంతునితోడ ననియె భూజనులు, దోసంబు లాడిన దుష్కీర్తి కోడి
జనకజపావనచరితంబు మొదలఁ, గనియును నీతెంపుఁ గావించె విభుఁడు
క్రూరమృగవ్యాళఘోరకాంతార, దారుణావస్థకుం దగునె యాసాధ్వి
యెందు ననిరి పాప మీపాపఫలము, బ్రందినజనులతో పార్థివేంద్రునకొ
యనఘాత్ముఁ డారాముఁ డపవాదభీతుఁ, డనవుడు నాసుతుఁ డనియెఁ గే ల్మొగిఁచి
యేమిటి కీవెంట నింత శోకింప, సౌమిత్రి మదిలోన సంతాప ముడుగు
మీతండ్రి దశరథమేదినీనాథుఁ, డాతతబుద్ధిమై నడిగినఁ దొల్లి
యది రహస్యం బైన నాదేవమంత్రి, సుతుఁడు దూర్వాసుండు సూచించినాఁడు
అది నీకు నెఱిఁగింప నవసరం బగుట, విదితంబుగాఁ జేతు విను గోప్యముగను
గురునమస్కారంబుకొఱ కొక్కనాఁడు, ధరణీశనందన దశరథేశ్వరుఁడు
రమణీయగతి నేగె రథ మేను గడప, నమరవసిష్ఠుని యాశ్రమంబునకు
ననఘు౦డు దూర్వాసుఁ డంతకు మున్ను, చనుదెంచి యం దొక్కసంవత్సరంబు
నెమ్మి వసిష్ఠుండు నిలుపంగ నిలిచి, సమ్మదంబున నున్నసమయంబునందు
వసుధేశుఁ డాశ్రమవనసమీపమున, నసమానరుచిఁ బొల్చునరదంబు డిగ్గి
చని యావసిష్ఠుని చరణాబ్దములకు, ననఘాత్ముఁడై మ్రొక్క యర్కతేజమున
వ్రాలు నమ్మునిముఖ్యు వామభాగమున, నాలోలకీలోగ్రమగు నగ్నిభంగి
నమరు దుర్వాసున కవనతుం డగుడుఁ, గొమరార వారును గుశలంబు లడిగి
యధికప్రియంబున నర్ఘ్యపాద్యములు, మధురఫలాదులు మానుగా నొసఁగి
యుచితాసనమున నుండఁగఁ బనిచి, యుచితప్రసంగంబు లొండొండఁ దిగిఁచి
ధర్మకథాగోష్ఠి దగిలియుండఁగను, ఘర్మదీధితివోలె గహనమధ్యమున
నయ్యెడ ముకుళితహస్తాబ్జుఁ డగుచు, నయ్యత్రిపుత్రుతో నవనీశుఁ డనియె