పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావణుఁ గనుకొని రజనీచరేంద్ర, నీవెన్క రాలేము నిలువంగలేము
మాదగ్పములు దక్కె మామతుల్ దూలె, నీదీవిసామర్థ్య మెట్టిదో గాని
యిది చూడు మరుదైన యీపుష్పకంబు, చదలగాడ్పులఁ దూలు జలదంబుభంగి
నిగుడక నిలువక నిజశక్తి దూలి, మగిడిపోయెడి దీని మది విచారింపు
మదగర్వ మింకిన మాపని యేమి, కదనంబునకు నంచుఁ గడిమి పోవిడిచి
తొలఁగజూచిన వారితోన పుష్పకము, దొలఁగంగఁబుచ్చి యాదోషాచరేంద్రుఁ
డొక్కఁడె చనుదెంచె యుద్ధంబు సేయ, నిక్కడఁ గలవీరుఁ డెవ్వఁడో యనుచుఁ
బరికించియందుల పడఁతులఁ గాంచి, యరు దంది కదియంగ నం దొక్కవనిత
యడరువేడుక పుట్టి యఱచేతిలోన, నిడుకొని నవ్వుచు నెలమితోఁ బలికె
నెవ్వఁడు పుత్తెంచె నిం దేల వచ్చి, తెవ్వనితనయుండ వెవ్వఁడ వనిన
నేవిశ్రవసునకు నిష్టపుత్రుండ, రావణుఁడనియెడు రాక్షసేశ్వరుఁడ
సమరార్థి నై యిందుఁ జనుదెంచినాఁడ, నమితవిక్రమశాలి యగువానినొకని
నెక్కడఁ బొడఁగాన నే నంచుఁ బలుక, నక్కొమ్మలందఱు నందంద నగుచు
నానాతిచే నప్పు డ ట్లున్నవానిఁ, దా నందుకొని యొక్కతరలాయతాక్షి
శిరములు పదియును జేతు లిర్వదియు, నిరులుఁ గొన్మేనునౌ నిది యొక్కపురుగు
కనువింత చెలులార కనుఁగొనుం డనుచు, నడు మంటఁబట్టి యానాతులు చెలఁగి
శిశువు నెత్తినభంగి జిరజిర గొనఁగ, దిశ లెల్లఁ ద్రిప్పినతెఱఁగుగాఁ ద్రిప్పి
వారివారికి నిచ్చి వనజాక్షు లిట్లు, వారక నొగి నెల్లవారు గావింపఁ
గడక నొక్కతె చేయి గఱచె నాసతియుఁ, జెడుపుర్వు గొనుమంచుఁ జెలిమీఁద వైవ
నదియు నాదశకంఠు నవలీలఁ గొనుచు, నొద విన వేడ్కతో నుడువీథి కెగసి
కడువల్క చెలిచేయి గఱచినపుర్వ, వడిఁబోయి పడు మంచు వాని వైచుటయుఁ
గులిశాహతం బైనకొండచందమున, బలువిడి నబ్ధిలో బడియె మ్రోయుచును
నిబ్భంగి నందలియింతులచేతఁ, బ్రాభవం బెడలిన పఙ్క్తికంధరుడు
పడినచందముఁ జూచి పరమహర్షమున, నడరి నారదుఁ డాడె నని చెప్పిమఱియు
మనుజేంద్ర నీచేత మరణంబు నొంది, ఘనకీర్తిసుఖములు గైకొందు ననుచు
లోకైకరక్షణలోలుఁడ వైన, నీకుఁ గోపము పుట్ట నిఖిలలోకముల
గాఢదర్పంబునఁ గలఁచె రావణుఁడు, మూఢాత్మకుఁడు గాఁడు మోక్షార్థి గాని
విక్రమోజ్జ్వల నీవు విష్ణుఁడ వగుటఁ, జక్రగదాశంఖశార్ఙ్గహస్తుఁడవు
వామనరూపంబు వలనొప్పఁ దాల్చి, భూమి మూఁడడుగులు పొలము ము న్నడిగి