పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోయింది” పాపం సుబలుడికి పిచ్చియెత్తింది కాబోలును. అతణ్ని చూచి నాలుగుసంవత్సరాలు కావచ్చింది. ఇక్కడవున్నప్పుడు అతను నామీద యెంతో ప్రేమగా వుండేవాడు. తరువాత చదువుదాము- “అతనికి యేమీతోచక వూరికే పిచ్చివాడులాగు తిరుగుతూవున్నాడు. అతనికి మనస్సు స్వస్థతపడేదాకా కొంతకాలంమీదగ్గరవుండడానికి నేటి సాయంకాలమే మీదగ్గరకు పంపిస్తూవున్నాను. రేపు మధ్యాహ్నానికి అక్కడకువస్తాడు.”— రేపుమధ్యాహ్నానికా? అలాగైతే యింక కాస్త సేపటికి వస్తాడు- “అతనివిషయం మీరు కొంచెం శ్రద్ధవహించి మనస్సు స్థిమితపడేటట్టు చెయ్యవలెను. సుమతితోకూడి అల్లరిగా తిరగనియ్యకండి. మావాణ్ని మీయోగపిచ్చలోమాత్రం దింపవద్దు. వాడికి యిదివరకువున్న పిచ్చచాలును.”

రాము – అలాగైతే యిఖ మనయింట్లో పిచ్చువాళ్ళు వకరికి యిద్దరవుతారు.

సుమ — వకరెవరురా?

రాము – అయ్యగారు.

సుమ - నోటిమీదతన్ని పోయేరు. ఇటువంటి పేలాపనలుపేలకు గౌరిని నేను రమ్మన్నానని నాగదిలోకి పంపించి నీవువెళ్ళి నీపనిచేసుకో. పో. (అని వెళ్ళుచున్నది.)

రాము – అమ్మా! యిప్పుడే వెళుతాను. అయ్యో! అప్పుడే యీవిడె వెళ్ళిపోయిందే. అమ్మాయిగారికి నామీదకోపంవచ్చింది కాబోలును. అదుగోగౌరి యిక్కడికే వస్తూవున్నది. నేను వెళ్ళ నక్కరలేదు.

(గౌరి ప్రవేశించుచున్నది)

గౌరి - ఓయీరామా! నీవు వొంటరిగా యిక్కడ యేమి చేస్తూ వున్నావు? మామూలుప్రకారంగా నీలోనీవు సణుక్కుంటూ వున్నావాయేమిటి!