పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేరినవారనుకుంటాను. (బిగ్గరగా) అయ్యా! దయచెయ్యండి. నేను యీ వూరు మంచిదనుకుంటాను.

సదా - బహుమంచిగ్రామం.

గజా — ఇక్కడ సమస్త సదుపాయాలూ వున్నవి.

సుబ — ఈయేడు పంటలు బాగావున్న వా?

సదా - బాగానే వున్నవి.

సుబ — మీ కేమయినా నల్లమందు వెయ్యడం అలవాటు వున్నదా?

సదా - లేదు. మిమ్మలిని మేము కొన్ని ప్రశ్నలను వెయ్యవలె నని వున్నది. అడుగవచ్చునా?

సుబ - అడగవచ్చునుగాని నేనేముందుగా కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి జవాబుచెప్పండి. మాతండ్రిగారి మేనమామకొడుకు మీతల్లిగారి మేనత్త మనమడై నట్టయితే, అతను పూజారి జాంబ వంతుడికి యేమవుతాడు?

సదా - యేమికాడు.

సుబ — యేమీకాకపోతే నన్నుమీరు యిలాగంటి సందర్భం మాలిన ప్రశ్నలు మాత్రం వెయ్యకండి.

సదా - (తనలో) నేననుకున్నట్టే యితనిది తప్పకుండా పైత్య చలనమే. (బిగ్గరగా) మీరేమీ సందేహపడవలసిన పనిలేదు. మేమటు వంటి ప్రశ్నలు వెయ్యము. ఏమండీ! గజాననదాసుగారూ! మీరే మంటారు?

గజా - యెంతమాత్రమూ వెయ్యము. (తనలో) ఇది భూత లక్షణమే సందేహం లేదు.

సుబ - అలాగయితే ఆరంభించండి.