పుట:ముకుందవిలాసము.pdf/3

ఈ పుట ఆమోదించబడ్డది

భూమిక

జాతి సాంస్కృతిక జీవనానికి లలితకళలు దర్పణం వంటివి. అటువంటి లలితకళలలో సాహిత్యం ప్రధానమైనది. సాహిత్యం రసప్రదాయిని, సౌందర్యదర్శిని కావడంతోపాటు సామాజిక ప్రయోజనకారి కావడమే ఇందుకు కారణం. వర్తమానం భూతభవిషత్తులకు వారది. కనుక గతకాలం సాధించిన సత్ఫలితాలను పదిలపరిచి, వాటిని మరింత సుసంపన్నంచేసి భావితరాలకు అందజేసే బాధ్యత నెరవేర్చాలి.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఈ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రాచీన కావ్యాలను పదిమందికి అందుబాటుచేసే నిమిత్తం వాటిని ముద్రించే, పునర్ముద్రించే పథకం చేపట్టింది. వింద్వాంసులచేత చక్కగా అధ్యయనం చేయించి, కవి, కావ్యాలగూర్చి విపులమైన పీఠికలు రాయించి, అట్టి ముద్రణలో పొందుపరుస్తూ వచ్చింది. అదే విధంగా సంకలనాలు, ఆసక్తికరమైన అధ్యయనాలు కూడా ప్రకటిస్తూ వచ్చింది .

ఒక సాహిత్య రంగంలోనేగాక, తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ఇతర రంగాలలోకూడా జరుగుతూఉన్న కృషిని మరింత ముమ్మరం చేసి, ఏకీకృతంచేసి ఉదాత్త స్థాయికి కొనితెచ్చే సదుద్దేశంతో మాన్యశ్రీ నందమూరి తారక రామారావుగారి నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం ఇటీవల తెలుగు విజ్ఞానపీఠం నెలకొల్పింది. తెలుగు సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాలలో కృషిచేస్తూఉన్న భిన్న ప్రభుత్వ పోషిత సంస్థలను ప్రస్తుత రూపాలలో ఉపసంహరించి, అవి చేస్తూ వచ్చిన కృషినీ, లక్ష్యించిన ధ్యేయాలనూ విస్తృతంగా, పటిష్ఠంగా కొనసాగించవలసిన బాధ్యత తెలుగు విజ్ఞాన పీఠానికి అప్పగించారు. ఈ పరిణామ కాలంలో, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఇదివరకే ప్రారంభించిన ప్రచురణలను తెలుగు విజ్ఞానపీఠం స్వీకరించి ప్రకటిస్తున్నది. ప్రస్తుత గ్రంథం ఆ కోవలోనిదే.

“ముకుంద విలాసము” అనే ఈ ప్రబంధం పద్దెనిమిదో శతాబ్ది ఉత్తరార్ధానికి చెందిన పండితకవి కాణాదం పెద్దన సోమయాజి విరచితం. అష్ట