పుట:మీగడతరకలు.pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది


అతఁ డిట్లనియెనో లేదొ - అంతలోనే,
ఎచటనుండియొ యొక పెద్ద యెలుఁగుగొడ్డు
గుఱ్ఱుగుఱ్ఱున సటలెత్తి ఘుర్ఘురించి
పరుగువాఱుచు నాచెంత కరుగు దెంచె.

జల్లుజల్లున నొడలెల్ల జలదరింప
తనదుమిత్రునిమాటయె తలఁపు గొనక ,
పిక్క సత్తువ చూపించి భీముఁ డంత
తరువుమీఁదికి గుప్పించె సరభసమున

ఏమి చేయంగఁ దోచక రాముఁ డంత
చాపకట్టుగ నేలపై సాగిలఁబడి
కాలుసేతుల నట్టిట్టు కదపకుండ
ఉర్పు బిగబట్టి చచ్చిన యోజ నుండె

అంత భల్లూక మాతనిచెంతఁ గదిసి
ముక్కు నోరును చెవులును మూరుకొనుచు
చచ్చి యెన్నఁడో చివికిన శవమిదేల ?
అనుచు నాతని విడనాడి యనలఁ జనియె.

14