పుట:మీగడతరకలు.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది



"ఔర ! సర్వజ్ఞుడని పెద్ద పేరెగాని
బమ్మ యొనరించు సృష్టి జాలమ్మునందు
అకటవికటము కానట్టి దొకటి కలదె?
బుద్ధి పెడతలఁ బట్టెఁబో వృద్దుఁ డగుట.

"అట్టె దానొక నేర్పరి యయ్యె నేని
పెద్ద చెట్టున కనువైన పెద్దపండ్లు
చిన్న చెట్టున కనువైన చిన్నపండ్లు
కూర్ప నగుఁ గాని, ఈ తాఱుమార్పు లేల ? ”

అనుచు నీరీతి తలపోసికొనుచు నంత
కొంతసేపటి కాతండు కూర్కు జెందె ;
గాలి కిట్టట్టు కొమ్మలు కదలియాడ
మఱ్ఱికాయలు పడె వానిబుఱ్ఱపైని.

దద్దఱిలి లేచి తనతల తడవికొనుచు
అయయొ! ఇవ్వియె పెద్దపండ్లయ్యె నేని
బళ్ళు మంచును నాతల బ్రద్దలగుచు
యమునివాకిట ప్రాతకాపగుదుఁ గాదె ?

8