పుట:మీగడతరకలు.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది


"సందియం బేల? ఈగుహాయందె యతడు
జొచ్చి తలదాచుకని యుండవచ్చు నిజము ”
అనుచు వచియించె నొక్కఁడు; “అట్లు కాదు
ఇందు లేఁడని నే వచియింపఁ గలను.

సఖుఁడ ! అల్లదె చూడుమా సాలెగూఁడు
అల్లిబిల్లిన ద్వారంబు నల్లి కొనియె:
వచ్చి రాకొమరుం డిందుఁ జొచ్చె నేని
చెక్కు చెదరక నిలుచు నే చెలఁదిగూఁడు ? "

అనుచు నీరీతి "రెండవయతఁడు పలికె ;
"సర్పములు క్రూరమృగములు సంచరించు
నిందు జొర నేల ? చావంగ నేల" యంచు
వారు వెడలిరి వచ్చినదారి బట్టి.

'బ్రతుకు జీవుఁడ' యంచు నీవలికి వచ్చి,
రాజసుతుఁ డంత తనయంతరంగ మందు
నిట్లు తలపోసె అక్కటా ! యిఁతదనుక
అల్ప జంతువులను నింద సల్పినాఁడ.

5