పుట:మార్కండేయపురాణము (మారన).pdf/129

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

మార్కండేయపురాణము

చతుర్థాశ్వాసము




కంఠరుచిరచరణా
బ్జాకరసంతతవిహారహారిమరాళా
లోకస్తుత్యసుశీలా!
నాకాధిపవిభవపూర్ణ నాగయగన్నా.

1


వ.

పరమజ్ఞానపక్షు లాజైమినిముని కి ట్లనిరి నీయడిగిన విధంబంతయుఁ గొఱంత వడ
కుండఁ జెప్పితి మింక నేమివలయు నడుగు మనిన నాద్వైపాయనశిష్యుం డి ట్లనియె.

2


సీ.

అక్కట! యిట్లు తిర్యక్త్వంబు నొందియు జనకప్రసాదసంజనితమహిమ
నిర్మలవిజ్ఞాననిర్ధూతమోహుల రగుట ధన్యులరు మీ రనఘులార!
సకలధర్మాధర్మసంశయార్థములు నిర్ణీతము లయ్యె మీచేత నాకు
వితతప్రవృత్తినివృత్తికర్మద్వయఫణితు లేర్పడఁ జెప్పఁబడియె లోక


తే.

గణ్యుఁ డైనమార్కండేయుకతనఁ బుణ్య, తముఁడ నైతి మీయట్టియుత్తములఁ జేర
నరయ సంసృతిభ్రాంతులు నల్పభాగ్య, పరులు మిముబోంట్లసంగతి పడయఁగలరె!

3


తే.

ప్రవిమలజ్ఞానసంపన్నులైన, మీవలన నేఁ గృతార్థుఁడఁ గావవలదె
యెఱుఁగ వేడ్కయై యడిగెద నేను మిమ్ము, నర్థి నెఱిఁగింప మీ రర్హు లగుటచేత.

4


సీ.

స్థావరజంగమాత్మక మైనయీజగం బింతయు మున్ను దా నెట్లు పుట్టె?
కాలాంతమున నిది క్రమ్మఱ నెట్టులయం బందు సురలు సంయములు పితరు
లును రాజులును నెట్లు జననంబు నొందిరి మన్వంతరములమాడ్కి యెట్టు
వంశంబులును నొగి వంశానుచారిత్రమును నెట్టివవి సృష్టివిలయసంఖ్య


తే.

యెంత కల్పవిభాగంబు లేక్రమముల, క్షోణియునికి యెట్టిది తత్ప్రమాణ మెంత
వారినిధులును నేఱులు ధారుణీధ, రములు నడవులు నేప్రకారమున నుండు.

5

క్రోష్టుకిమార్కండేయసంవాదము

వ.

భూర్లోకాదిసమస్తలోకంబులు నేక్రమంబున నున్నవి రవిచంద్రాదిగ్రహనక్షత్ర
జ్యోతిర్గణంబులగతిప్రకారంబు లెట్టివి యింతయు నుపసంహృతంబైనం దుది