పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/75

ఈ పుట ఆమోదించబడ్డది

 పేరంటాలూ, నోములూ, వ్రతాలూ సంప్రదాయసిద్ధమైన వేడుకలను మన ఆడపడుచులు మరువలేదు. రామ భజనము, గోవిందపూజ, అమ్మోరు పండగల సందర్బాల్లో చుట్ట పక్కాలను పిల్చి పంచభక్ష్య పరమాన్నాలతో వారికి భోజనం పెట్టి ఆంధ్ర వనితలు 'అన్నపూర్ణ' అన్న పేరు సార్ధకం చేసుకున్నారు.

సహజంగా ఆంధ్ర వనితలు దైవభక్తి పరాయణులు మారిషస్ ఆంధ్రుల ఇళ్ళ ముందు చిన్న మందిరం లాంటిది ఉంటుంది. దానిని 'జంది' అని పిలుస్తారు. దానిలో ఆంజనేయుని ప్రతిమ పెట్టి పూజిస్తారు. ఆంజనేయుడు తమ ఇంటిని సదా రక్షిస్తాడని వారి ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతో వారు దొంగల భయాన్ని తాత్కాలికంగా మరచిపోయి తమ పని పాటల్లో లీనమై పోతారు.

ముదుసలి స్త్రీలు ఈ నాటికీ ఆ నాటి పౌరాణికపు పాటలూ, జానపద గేయాలూ, పెండ్లి పాటలూ పాడతారు. మారుతున్న కాలంలో వివాహ వ్యవస్థను కాపాడుకుంటూ మన వివాహ ఆచారాలను పాటించటం గొప్ప విషయం.

ఆంధప్రదేశ్‌లోని తెలుగువారిలాగానే వివాహ పద్ధతులు, కులాచారాలు, పూజలూ - పునస్కారాలు మారిషస్ లోని తెలుగు వారు జరుపుకుంటున్నారు. తమ రక్త సంబంధీకులు, తమ కులం లేక సామీప్యం ఉన్న ఇతర కులాల వారితోనే వివాహ సంబంధాలు పెట్టుకుంటారు. కుటుంబ గౌరవం, ఆస్తిపాస్తులను దృష్టిలో ఉంచుకుని వివాహాలు జరుగుతాయి. మారిషస్ తెలుగువారిలో తెలగ, కళింగ, కంపోలు కులాల వారు ఉన్నారు. వారిలో తెలగవారు సంఖ్యాపరంగా అధికులు. ఈ మూడు కులాల్లో వివాహాలు జరుగుతాయి.

సంక్రాంతి, శివరాత్రి, దీపావళి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి మొదలైన పండుగలను సంప్రదాయ సిద్ధంగా తెలుగువారు జరుపుకుంటూరు.

దీపావళిని మారిషస్‌లో ఉన్న ఉత్తర భారతీయుల కంటే ఆంధ్రులు, తమిళులు ఒక రోజు ముందుగా జరుపుకుంటూరు. శ్రీరాముడు లంక నుండి స్వస్థానానికి చేరడానికి దక్షిణ భారతాన్ని ముందుగా దాటాడని అందువలన ఒక రోజు ముందుగా జరుపుకుంటామని వారు చెప్పుతుంటారు.

ఉగాది మన తెలుగు సంవత్సరాది, పులుపు, చేదు రుచులతో పచ్చడి చేసి జీవితము కష్టసుఖాల కలయిక అని తెలియచెబుతారు ఆంధ్ర వనితలు.

మారిషస్‌లో తెలుగువారి స్థానం

1972 జనాభా లెక్కల ప్రకారం మారిషస్‌లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య