పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

శుభాకాంక్షలు

తెలుగు భాషన్నా, తెలుగు ప్రజలన్నా చచ్చిపడే స్వభావం గలవారు శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు. ఈయన ఆంధ్రప్రదేశ్ విద్యా సాంస్కృతిక శాఖామాత్యులుగా యున్నప్పుడు ప్రథమ ప్రపంచ తెలుగు మహా సభలను 1975లో హైదరాబాద్ మహానగరంలో అతివైభవముగా జరిపించి, క్రీ.పూ. 2వ శతాబ్దినుండి క్రీ.శ. 3వ శతాబ్ది వరకు భారతదేశంలోని సగం భాగాన్ని పరిపాలించుటయే గాక జావా, సుమత్రా, మలయా, బర్మా, కంబోడియా వంటి దేశాలలో కళింగ, మలాకా, శ్రీ విజయ వంటి రాజ్యాలను కూడా స్థాపించి వాటికి రాజులుగాను, రారాజులుగాను ఉండి తెలుగు జెండాను ప్రపంచమంతా ఎగురవేసిన తెలుగు శాతవాహనుల కాలమున జగమంతా చెల్లాచెదురైన తెలుగు జాతిని ఒక్క వేదికపైకి తెచ్చిన ఘనతకు పాత్రులయ్యారు.

"పులికి పుట్టినది పిల్లి కానేరదు" అన్నట్లు శ్రీ బుద్ధప్రసాద్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా, శ్రీ మండలి వెంకట కృష్ణారావు - ప్రభావతి పుణ్యదంపతుల జ్యేష్ఠ పుత్రుడుగా జన్మించి, తన తండ్రి అడుగు జాడలలో నడుచుట పొగడదగ్గదగును.

శ్రీ మండలి బుద్దప్రసాద్ గారు వ్రాసిన "మారిషస్ లో తెలుగు తేజం' అన్న గ్రంథాన్ని చదివి, అందులో చక్కగా వర్ణింపబడిన విదేశాంధ్రుల చరిత్ర, సమస్యలను చదివి తెలుసుకొని అమితానందభరితుడనయ్యాను. మలేషియా ఆంధ్ర సంఘ (1955) వ్యవస్థాపకునిగానూ, ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభల (మలేషియా) ప్రధాన కార్యదర్శిగానూ ఈ యువ, నవ రచయితకు నా శుభాకాంక్ష లందిస్తున్నాను.

"భాష జాతికి ప్రాణం! భాష నశిస్తే జాతి నశిస్తుంది" అన్నది నగ్న సత్యం. అందు వల్లనే విదేశాలలోను, ప్రవాసాంధ్రలోను నివసించు తెలుగు తల్లి తనయులు తమ మాతృభాషనూ, సంస్కృతినీ నశించకుండా కాపాడుటకు యితర జాతుల, యితర భాషల మధ్య యుంటూ అష్టకష్టాలు