పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

భారతప్రభుత్వ ప్రతినిధి, పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి జమునా రమణారావు ప్రసంగిస్తూ "తెలుగు మహాసభల నిర్వహణకు పూనుకున్న మారిషస్ ప్రభుత్వాన్ని అభినందించారు. ప్రధాని శ్రీ అనిరుద్ జగన్నాధ్ సారధ్యంలో మారిషస్ శీఘ్రగతిని అభివృద్ధి పధం వైపు పయినించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భారత ప్రతినిధిగా పార్లమెంటు సభ్యురాలిగానే కాకుండా ఒక కళాకారిణిగా ఈ మహాసభలలో పాల్గొనటం తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతా సూచకంగా ప్రధాని శ్రీ అనిరుద్ జగన్నాధ్‌కు పెంబర్తి నెమలి బొమ్మను, గవర్నర్ జనరల్ శ్రీ వీరాస్వామి రింగడుకు కొండపల్లి బొమ్మలను శ్రీమతి జమున బహుకరించారు.

ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణా రధసారధిగా మహాసభలలో సన్మానించబడిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు మాట్లాడుతూ "ప్రపంచంలోని తెలుగు వారందరి మధ్య మరింతగా సన్నిహిత సంబంధాలు నెలకొనటానికి మహాసభలు తోడ్పడతాయనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. విదేశాలలోని తెలుగు ప్రజల భాషా సంస్కృతుల పరిరక్షణకు చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోడ్పాటునందించ వలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మారిషస్ మహాసభలకు స్పూర్తినిచ్చిన స్వర్గీయ కృష్ణంరాజు సేవలను సంస్మరించి జోహార్లు అర్పించారు.

మహాసభలను దిగ్విజయంగా నిర్వహించిన మారిషస్ ప్రభుత్వానికీ, 'మారిషస్ ఆంధ్ర మహాసభకు శ్రీ కృష్ణారావు కృతజ్ఞతాభి వందనాలు తెలియచేశారు. నేషనల్ ఆర్గనైజేషన్ కమిటీ ఛైర్మన్, మారిషస్ విద్యామంత్రి శ్రీ ఆర్ముగం పరుశురామన్ మాట్లాడుతూ-"మారిషస్‌లో నివశిస్తున్న విభిన్న జాతుల ప్రజలు తమ పూర్వీకుల భాషా సంస్కృతులను కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందనీ, అందులో భాగంగానే తృతీయ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ప్రభుత్వం పూనుకున్నదనీ అన్నారు."

మారిషస్‌లో గతంలో ప్రపంచ హిందీ మహాసభలు, తమిళ మహాసభలు జరిగాయని, రాబోయే సంవత్సరాలలో మరాఠీ, ఉర్దూ, చైనీస్, ప్రపంచ మహాసభలు నిర్వహిం చనున్నామని తెలిపారు, తెలుగు భాషకు తమ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందని, 700 మంది తెలుగు విద్యార్థులు సి.పి.పరీక్షలకు, 20 మంది హయ్యర్ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.