పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

వ్యక్తిత్వాన్ని పుణికి పుచ్చుకున్న మహామనీషి. తెలుగు వారికి సదా గర్వకారణమైన కళామతల్లి ముద్దుబిడ్డడు పద్మభూషణ్ డా॥ అక్కినేని చలన చిత్రోత్సవాన్ని ఆరంభించటం అందరినీ ఆనందపరిచింది.

19 సంవత్సరాల వయసులో చలన చిత్ర రంగంలో అడుగిడి అంచెలంచెలుగా కీర్తి శిఖరాల నధిరోహిస్తూ 46 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తూ మకుటం లేని మహారాజుగా వెలుగొందుతూ అక్కినేని తెలుగు సినీ పరిశ్రమకు పర్యాయపదం అయినాడు.

శ్రీ నాగేశ్వరరావు తన కుమారుడు శ్రీ నాగార్జునతో కలిసి నటించిన 'కలక్టర్ గారి అబ్బాయి' చిత్రాన్ని తొలి చిత్రంగా చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు

తెలుగువారు గర్వించతగ్గ మహానటి, శ్రీమతి జమునా రమణారావు పార్లమెంటు సభ్యురాలి హెూదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. మారిషస్ మంత్రులు, తెలుగు ప్రముఖులు, విదేశీ ప్రతినిధులతో హుందాగా జరిగింది ప్రారంభోత్సవ కార్యక్రమం. ఈ చలనచిత్రోత్సవంలో మారిషస్‌లో నిర్మించబడిన చిత్రం యుద్ధభూమి, అంకితం, మంగమ్మగారి మనుమడు, ఇరవయ్యవ శతాబ్దం చిత్రాలు ప్రదర్శించబడ్డాయి.

శ్రీ నాగేశ్వరరావు, శ్రీమతి జమునా రమణారావు నటులుగానే కాక తెలుగు తేజం దేశ దేశాల కాంతి కిరణాలై నిండాలనీ, తెలుగు భాష సుమధురంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిల్లాలనీ కోరుకునే వారిలో ప్రధములు.

మారిషస్ తెలుగు జ్యోతి మహాసభ

వాకోస్ లో తెలుగు చలన చిత్రోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే పోర్టులూయిస్‌కి బయలుదేరాం. సుందర నగరమైన పోర్టులూయిస్ మారిషస్ దేశ రాజదాని.

పోర్టులూయిస్‌లోని రామకృష్ణ మందిరంలో మారిషస్ తెలుగుజ్యోతి మహాసభవారు ప్రార్ధన సమావేశాన్ని నిర్వహించారు. పోర్టులూయిస్‌లోని మొదటి తెలుగు దేవాలయం రామకృష్ణ మందిరం. దీనిని 1964 ఏప్రెల్ 19న శ్రీ ఎస్.హెచ్.కె.అవుమయ్య ప్రారంభోత్సవం చేశారు.

"ప్రపంచ తెలుగు మహాసభలను రక్షింపుము పాహిమాం' అంటూ వారు ప్రార్ధనలు చేశారు.-"జయ జయ ఓంకార.. జయ జయ చతుర ఓంకార" అంటూ భజనలు మధురంగా చేశారు. వారి భక్తి ప్రపత్తులు మమ్మల్ని ఎంతగానో పరవశింప చేశాయి.