పుట:మాటా మన్నన.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుబంధం

1

కం. ఎదిరికి హితమును బ్రియమును
     మదికింపును గాఁగఁ బలుకు మాటలు పెక్కై
     యొదవినను లెస్స యటు గా
     కిది యది యన కూర కున్కి యెంతయు నొప్పుచున్.

కం. చెలిమియుఁ బగయును దెలివియుఁ
     గలఁకయు ధర్మంబు బాపగతియును బెంపుం
     దులువతనంబును వచ్చును
     బలుకుబడినఁకాఁన పొసఁగఁ బలుకఁగవలయున్

చం. పలుకక యుండుకంటెఁదగఁబల్కుట మేలు, వినుండుసత్యముం
     బలుకుట ధర్మమార్గమునఁ బల్కుట సర్వజనప్రియంబుగాఁ
     బలుకుట యోలి నెక్కు డగు భంగులువాని నెఱింగి యొండుమైఁ
     బలుకక నాల్గుచందములఁ బల్కఁగఁ మెత్తురువాని దేవతల్.

కం. తనువున విరిగిన యలుగుల
     సనువునఁ బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
     మనమున నాఁటిన మాటలు
     విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!

58