పుట:మాటా మన్నన.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నతనంలో ఉన్నట్లు చెయ్యరు-అని ఏదో పెద్దలు చెప్ప బోయే మాటలు వారికి విసుగుపుట్టిస్తవి. గత 20, 30 సంవత్సరాల్లో పరిస్థితులు ఎట్లా మారింది, పిన్న పెద్దలందరకు తెలుసు. అందుచేతనే నేటి యువజనులు అధిక స్వాతంత్ర్యాన్ని, అనుభవిస్తూ స్వేచ్చా సౌఖ్యంలో ఉన్నారు. ఈ నూతన వాతావరణంలో పుట్టి పెరగటంచేత వారు నూతన ప్రపంచంలో ఉన్నట్టు భావిస్తారు. పూర్వకాలానికి గాని, ఆ మార్గానికిగాని, అవి ఎంత మంచివైనా వారు సుతరామూ ఇష్టపడరు. పూర్వకాలపువారు తమకంటె సచ్చారిత్రులన్న మాట వారికి ఏవగింపుగా ఉంటుంది. వీరే గాదు; ప్రతివారు తమ తరాన్ని గురించి గొప్పగా చెప్పుకోవటం సహజమే. తానీషాలనాడుకూడా తండ్రులు తమ పిల్లలు పాడైపోతున్నారని ఆక్రోసించారు. యువజనులు అర్హతలేనివారి విమర్శలను పాటించరు. నాటికి నేటికి చాలా తేడా ఉన్నదనీ, పూర్వ జీవితం చాలా సుళువైనదనీ నేటి సాధక బాధకాలు పెద్దలు గ్రహించలేరని వారిభావన.

ఈ ధోరణితోనే సలహా, విమర్శన లుంటాయి. అయాచితంగానే పెద్దలు సలహాలు ఇవ్వబోతారు. “ నేనే ఈ దశలో ఉంటే ఆపని చేసేవాడిననో, ఆమాదిరిగా ప్రవర్తించటం బుద్ధిహీనతకాదా అనో ఏదోవిధంగా పిల్లలమీద విరుచుకు పడతారు. పిల్లలు పైకి అనరుగాని, 'నీ అభిప్రాయాన్ని ఎవరు అడిగారు? అడగందీ పెట్టందీ ఇవన్నీ ఎందుకు'? అని తమలో తామైనా అనుకొంటారు. నిజంగా

46