పుట:మధుర గీతికలు.pdf/772

ఈ పుట ఆమోదించబడ్డది




నరుల వెత దీర్చి, సాపముల్ మఱవఁజేసి,
భగ్న మగు వారి హృదయముల్ పదిలపఱచి
జీవితంబుల సరియైన త్రోవ నడవ
సదమల గ్రంధసదనంబు సాధనంబు,

సభ్యతకు తాపు, కళలకు జన్మభూమి,
భోగ భాగ్యముల కిరవు, నాగరికత
కాలవాలము, సంస్కృతి కాటపట్టు;
అఖిల కళ్యాణకరము గ్రంథాలయంబు.

పుణ్యముల సీమ, గుణముల పుట్టినిల్లు,
ధర్మముల కాకరంబు, సద్గతికి నెలవు.
త్యాగముల తావు, నీతికి తావలంబు:
గ్రంథనిలయంబు సకల మంగళకరంబు,

తల్లివలె సాకు. బోధించు తండ్రికరణి,
వంత లడఁగించి రంజించు పత్నివోలె,
కాంక్ష లొనగూర్చు నెచ్చెలికాని లీల,
గ్రంధనిలయంబు సాధింవరానిదేది ?

గ్రంథనిలయంబు నీ కూర్మి బంధువుండు.
నీదు తల్లియు. తండ్రియు, సోదరుండు,
నీకు మనసిచ్చి వర్తించు నేస్తకాఁడు,
జీత బత్తెంబు లడుగని సేవకుండు,