పుట:మధుర గీతికలు.pdf/771

ఈ పుట ఆమోదించబడ్డది




పన్నులడుగదు, తను జేర వచ్చువారి
నన్ని వేళల ప్రీతితో నాదరించు,
ఎవ్వరడిగిన నే పొత్త మేని నొసఁగు;
అఖిలజనముల, హక్కు గ్రంథాలయంబు.

భాగ్యవంతుఁడు నిరుపేదవాఁడటంచు,
అగ్రకులజుఁడు, కడజాతియతఁడటంచు
ఉచ్ఛనీచ విభేదంబు లుజ్జగించు;
అఖిలజనముల హక్కు గ్రంథాలయంబు.

అఖిల జాతీయతాభావ మలవరింప,
అమల విజ్ఞానసంపద నమరఁజేయ,
సాంఘికాచార ధర్మముల్ సంస్కరింప,
సదమల గ్రంథసదనంబు సాధనంబు.

విమల దేశాభిమానంబు వెలయఁజేయ,
నిఖిల సౌభ్రాత్ర భావంబు నెఱయఁజేయ,
సకల లోకకళ్యాణంబు సాఁగఁజేయఁ
సదమల గ్రంధసదనంబు సాధనంబు

పనులయందు ప్రవీణత, పలుకులందు
సరసతయు, ధనార్జమున చతురతయును.
జీవనంబున సౌఖ్యంబు చెందఁజేయ
సదమల గ్రంథసదనంబు సాధనంబు,

50