పుట:మధుర గీతికలు.pdf/770

ఈ పుట ఆమోదించబడ్డది




గాలి నీరును లేకున్న గడపవచ్చు.
గ్రాసమును లేక యెట్టెటో గడపవచ్చు;
గడపవచ్చునె మన మొక్క గడియయైన
గ్రంథ భాండారములు లేని గ్రామముందు ?

గ్రంథనిలయంబు గల నరకంబునందు
నైన నివసింపఁ గాంక్షింతుఁ గాని, నేను
గ్రంథనిలయంబు లేని స్వర్గంబునందు
నిముస మేనియు నివసింప నిచ్చగింప.

దేవళంబులు, సత్రముల్, సావడులును,
చెఱువులును వీట లేకున్న కొఱత లేదు;
దివ్యమగు నొక్క గ్రంధమందిరము లేని
వీడు వీడు గా దది, పాడు బీడు గాని,

గ్రంథనిలయంబునందలి గ్రంథములకు
గుణమె కాని ప్రధానము, గణము కాదు;
ఎన్నియో చెత్తపొత్తము లున్న కన్న,
ఉత్తమ గ్రంథములు కొన్ని యున్న చాలు.

ఏను గ్రంథాలయంబున కేగునపుడు,
గ్రంథములు నాకు కన్పట్టు కనులయెదుట;
ఉర్విజనులకు బోధించి యుద్ధరింప
వేడ్క దివినుండి వచ్చిన విబుధు లనఁగ.

49