పుట:మధుర గీతికలు.pdf/769

ఈ పుట ఆమోదించబడ్డది




ఆలయంబులఁ బోలె, గ్రంథాలయముల
విమలభక్తిని జనులు సేవింపవలయుః
ఎందు వెదకిన నందని యీశ్వరుండు
కాపురము నేయు నిరతంబు కావ్యవాటి.

మానితం బైన పుస్తకమందిరంబు
సుందరంబు, సకల జనానందకరము;
సహజ మగు దాని లావణ్యమహిమ గాంచి
భ్రాంతుఁ డగును తదీయ నిర్మాణకర్త.

తీర్చి శారద కై సేసి దిద్దుకొనఁగ.
మణుల మంజూష పుస్తకమందిరంబు,
తళుకు గుళికెడు వివిధరత్నముల నందు
కోరికలు దీర' జను లేరికొనఁగవచ్చు.

తనువు రక్తంబు జీవంబు ధారవోసి,
ఋషివతంసులు పెక్కు వేలేండ్లు తపము
సలిపి యార్జించినట్టి విజ్ఞానధనము
దాఁచియుంచిన పేటి గ్రంథాలయంబు,

కవులు, వక్తలు, రసికులు, గాయకులును,
చిత్రకారులు, నటులు, చారిత్రవిదులు.
ప్రకృతివేత్తలు, జోస్యులు- వారి కెల్ల
గ్రంథనిలయంబు సర్వదా కాపురంబు.

48