పుట:మధుర గీతికలు.pdf/768

ఈ పుట ఆమోదించబడ్డది




అది సమస్త జనాదరణైక సంస్థ -
ఉన్న తంబు, నుదారంబు, సుజ్వలంబు,
ఉత్తమోత్తమ, ముత్కృష్ట ముచిత పఠన
మందిరం బెన్న సర్వాంగసుందరంబు.

గ్రంథనిలయంబు జాతివజ్రంబు వోలె,
స్వప్రకాశము, సహజంబు, స్వచ్ఛతరము;
ప్రబల గాఢాంధకారంబు పాఱఁద్రోలి
దివ్యకాంతుల వెదచల్లి తేజరిల్లు.

పుస్తకాలయ మా విరాట్పురుషు లీల
అప్రమేయ మనంతంబు, నచ్యుతంబు;
అది స్వయంభువు - తనుదానె ఉదయ మంది
విశ్వరూపము ధరియించి వెలయుచుండు.

దాత వోలెను, గ్రంథనికేతనంబు
ఆర్థిజనముల కెల్ల లే దనక యిచ్చు:
అది విశిష్టము, స్వచ్ఛంద, మవ్యయంబు,
మధుర మంజుల భావ సమన్వితంబు,

మాత వోలెను. పుస్తకమందిరంబు
బాళిఁ దను జేర వచ్చినవారి నెల్ల
భేద మెంచక సమముగ నాదరించి,
జాతి మత సంఘ సామరస్యంబు నెఱవు.

43