పుట:మధుర గీతికలు.pdf/767

ఈ పుట ఆమోదించబడ్డది



మంచి గ్రంథము చదువఁ గాంక్షించువాడు
కోరఁడాప్తుల , సచివుల కూర్మిసఖుల;
దినదినంబును హితము బోధించుచుండు
పుస్తకములె తన యనుంగు నేస్తగాండ్రు

పరిజనంబులు, మిత్రులు, బాంధవులును
మనల విడుతురు లేమి పైకొనినవేళ;
అండఁ బాయక యెపుడు వెన్నంటి తిరుగు
పొచ్చెములు లేని నేస్తముల్ పుస్తకములు.

మేటికావ్యము జనులకు మేలు గూర్చు,
అధమకావ్యము తద్దయు హాని సేయు;
ఏది మంచిదొ, చెడ్డది యేదొ, యరసి
పుస్తకంబులు చదువంగఁ బూనవలయు,

గ్రంథాలయము



శ్రీకరంబును, విబుధవశీకరంబు,
పూజితంబును, సత్కళారాజితంబు,
భాసితంబును, విజ్ఞానవాసితంబు,
శారదాదేవి పీఠంబు సంస్తుతింతు.

46