పుట:మధుర గీతికలు.pdf/766

ఈ పుట ఆమోదించబడ్డది




సృష్టి మొదలుగ మనుజు లార్జించినట్టి
నిస్తులం బగు మాన్యముల్ పుస్తకములు;
సతము సద్గ్రంథ పఠనంబు కతనఁగాదె,
పృథివి నాగరకత జెంది వృద్ధి నొందు.

అమిత ధన ధాన్య భాగ్య భోగములకన్న,
అమల వాఙ్మయ రామణీయకము ఘనము;
శేముషీ వంతుల పవిత్ర జీవిత ప్ర
శస్త రక్తపుంజంబులు పుస్తకములు.

పుస్తకంబులు గలిగిన పూరిగుడిసె
యందు నిఱు పేద కాపునై యుందుఁగాని,
పుస్తకంబులు లేనట్టి భూరి సౌధ
మందు చక్రవర్తిగా నుండ నభిలషింప.

నిలువుటద్దాలు, సోఫాలు, చలువరాతి
రౌండుమేజాలు, కుర్చీలు నుండుఁగాక,
మంచి గ్రంథముల్ లేని యా మందిరంబు
మందిరం బది గా, దొక్క బంది గాని,

గ్రంథములు పెక్కు తనచెంతఁ గలిగియుండి,
అనయమును వాని చదువనియట్టివాఁడు
దివ్వెకరమున ధరియించి తిరుగు గ్రుడ్డి
వాని విధమున పరిహాసపాత్రుఁ డగును.

45