పుట:మధుర గీతికలు.pdf/764

ఈ పుట ఆమోదించబడ్డది

విద్య



విద్య ధన మిచ్చు, సత్కీర్తి వెలయఁజేయు,
బంధు మిత్రుల సమకూర్చు, పదపు లొసఁగు,
ఐహికాముష్మిక సుఖంబు అందఁజేయు;
తివిరి మనుజుఁడు విద్య సాధింపవలయు,

చదువుచే ప్రజ్ఞ, దానిచే సరసతయును,
దానిచే కార్యసఫలత, దాన ధనము,
దాన త్యాగము, భోగము, దాన యశము,
దాన సిద్ధించు వాంఛితార్థంబు లెల్ల.

ఆర్జనంబున దక్షత, వ్యయమునందు
మితము, సంభాషణంబున చతురతయును,
కార్యములయందు నిపుణత కలుగజేయు;
రమ్య మగు విద్య సమకూర్పరానిదేది?

నీటఁ జివుకదు, కాలదు నిప్పుసెగకు,
దొరల పాల్గాదు, దొంగలు దోచుకొనరు.
అన్నదమ్ముల పాళ్ళకు నలవి కాదు,
మేటి విద్యాధనమునకుచేటులేదు.

43