పుట:మధుర గీతికలు.pdf/763

ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీనామస్మరణము



ఏమి మహిమంబు గలదొ నీ నామమందు :
'బాపు' అను పేరు వీనులఁబడినయంత,
నిలువునను నాదు మే నెల్ల పులకరించు;
జల్లుమని నాదు హృదయంబు జలదరించు.
సర్వసారస్వత ప్రపంచంబునందు
‘గాంధి’ యనియెడు వర్ణయుగంబుతోడ
సాటివచ్చెడు వేఱొక మాట గలదె
మార్దవంబున, మధురిమ, మంజులతను
భువన ‘మోహన' మైన నీ ముద్దు పేరు
రామనామము కంటెను రమ్యమగుచు.
భ క్తిముక్తి ప్రదం బయి భవ్యమైన
అవ్యయానంద సౌఖ్యంబు లందఁజేయు.
కర్మయోగిని యై నీవు గ్రాలుకతన,
‘కర్మచంద్రుఁడు' అను పేరు కలిగెనీకు;
దివ్యమహిమంబుతో నీవు తేజరిలుట,
తనరె నీకు 'మహాత్ముఁడు' అనెడు బిరుదు.

42