పుట:మధుర గీతికలు.pdf/759

ఈ పుట ఆమోదించబడ్డది

దేహమునందు పిచికారీతో నెక్కించుట మన మెఱుగుదుము. ప్రకృతి శాస్త్రజ్ఞులు పదార్థములును కళేబరములును చెడకుండ గాపాడుటకు లవణము నుపయోగించుట ప్రసిద్ధము. సృష్టిలోని సమస్త వస్తుజాలమును, ప్రాణికోటియు ఉప్పు లేక జీవించుట అసంభవమని ప్రకృతిశాస్త్రప్రవీణులు పరిశోధించి నిర్ణయించిరి.

ఉప్పు శరీరమందలి క్రిములను నాశనము చేసి రక్తము శుద్దిపఱుచును. ఈ సంగతి గుర్తెఱెఁగి డచ్చివారు తమ ఖైదీలను హింసించుటకై ఉప్పులేని యాహార మొసగుటకు శాసించిరట ?

లవణము సాంద్రముగ నున్న జలమున నౌకలు అధిక భారము మోయగల వని శాస్త్రజ్ఞులు కనుగొనిరి. మధ్యధరా సముద్రమున నడచు ఓడలు నల్లసముద్రము (Black sea) నందలి యోడలకంటె ఎక్కుడు బరువులు మోయఁగలవు. ఏల యన, మధ్యధరాసముద్రమున నల్ల సముద్రమునకంటె లవణము 16 రెట్లు అధికముగనున్నది,

ఈ సందర్భమున ఉప్పుయొక్క ఘనత దెల్పుటకు హరివంశమందలి ఈ క్రిందికధ నుదాహరింతుము,

తొల్లి బ్రహ్మదత్తుఁ డను మహీపాలుఁడు సాశ్వదేశమును బాలించుచుండెను, వానికి హరుని వరమున హంసుఁడు దీచికుఁడు అను నిరువురు కొడుకులు జనిం చిరి. వారు తమజనకునిచే రాజసూయ యాగమును చేయింపఁ బూని, తమ మంత్రులలో నొకని శ్రీ కృష్ణు నాహ్వానింపఁ బంపుచు, అతనికిట్లు వచించిరి:

38