పుట:మధుర గీతికలు.pdf/757

ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్యులు గూడ ఉప్పు యొక్క ఉత్కృష్టత గుఱ్తెఱెంగి దాని నత్యంతపవిత్రవంతముగ భావించియుండిరి. వారు ఉప్పు ఊట భగవద్దత్త మని తలంచుచుండిరి. జర్మనులు ఉప్పుటేఱులకై యుద్ధములొనర్చిరి. ఉప్పుగల ప్రదేశములు పవిత్రవంతము లనియు, అచట జేయు ప్రార్ధనలు ఈశ్వర ప్రీతికరములనియు వారు నమ్ముచుండిరి, మఱియు గ్రీకులు రోమనులు ఉప్పును దేవత లకు నై వేద్యములు బెట్టుచుండిరి. వారు ఉప్పును రొట్టెయు భోజ నమునకు పారిభాషికముగ వ్యవహరించిరి, హోమరు ఉప్పును దివ్యము (Divine) గ భావించెను. ప్లేటో ఉప్పు భగవత్ప్రీతికర మని విశ్వసించెను. అరబ్బులు లవణసమ్మిశ్రితమైన భోజనము మంగళప్రద మనియు, అది బాంధవ్యమునకును మైత్త్రికిని ప్రేమ సూత్ర మనియు నమ్మి, ‘ఉప్పు మనల పరస్పర ప్రేమానుబద్ధుల జేయును' అని అర్థమిచ్చు (There is salt between us) అను నానుడిని వాడుచుండిరి. పారశీకులలో ద్రోహము చేయుట గూర్చి తెలుపునపుడు, 'నమక్ హరామ్' అను సామెతను వాడు చుందురు. (నమక్ - ఉప్పు, హరామ్ - ద్రోహము.) - రోమనులు నౌకర్లకును సైనికులకును పూర్వము ఉప్పు రూపమున జీతములిచ్చుచుండిరి. కావున ఆ జీతమునకు వారి భాషలో 'సాలరీ' (Salary) అని పేరు. 'సాలరీ' సాల్ (Sal) అను లాటిన్ (Eng : Salt) పదమునుండి ఉత్పన్నమైనది. పూర్వకాలముల ఉప్పు ఆర్ధికముగను పారమార్ధికముగను ఆవశ్యక

36