పుట:మధుర గీతికలు.pdf/756

ఈ పుట ఆమోదించబడ్డది

లోను పెద్ద ఉప్పుపఱ్ఱలు గలవు. పోలండునందలి ఉప్పుగనులు ప్రపంచమునం దెల్ల ప్రఖ్యాత మైనవి. ఆఫ్ఘనిస్థానమునుండి పంజాబ్ వఱకు ఉప్పుకొండల వరుసలు వ్యాపించి యున్నవి.


హిందూదేశమునందు పంజాబు రాష్ట్రములోను. రాజ పుటానాలోని శంబరసరోవరమున, సింధు గుజరాతుదేశము లందును ఉప్పు పుష్కలముగ లభించును. అంతియ కాదు. భారతదేశము నావరించియున్న సుమారు 5,000 మైళ్ళు పొడవు గల సముద్రతీరమున నెల్ల ఉప్పు పండును. మఱియు అలెగ్జాండరు హిందూదేశమునకు రాకపూర్వమే, ఉత్తరహిందూ స్థానమందలి విశాలమయిన గనులనుండి ఉప్పు తీయుచున్నట్లు చరిత్ర తెలుపుచున్నది.

పవిత్రత


ప్రపంచమునందలి సమస్తజాతులవారును, ఎల్లమతముల వారును ఉప్పును పవిత్రముగ భావింతురు. భారతీయులు హవ్య కవ్యములయందు లవణమునకు ప్రాధాన్యమిత్తురు. ప్రతిదినము వారు భుజించునపుడు, విస్తరిలో తొలుత ఉప్పును వడ్డింతురు; పితృకార్యములందు భోక్తలకు దధిమిశ్రిత లవణము వడ్డింతురు. మఱియు దృష్టిదోషములచే గలుగు కీడుల దొలఁగించుటకు దృష్టి తీయుటకు, అన్నద్వేషము కలిగినప్పుడు మంత్రించి లోనికిచ్చుట కును ఉప్పు నుపయోగింతురు.

35