పుట:మధుర గీతికలు.pdf/748

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విషయము గూర్చి మా సొంతనుడులతో దెలుపుట కన్న, అమెరికాదేశీయుఁడు రిచార్డ్ గ్రెగ్ అను సాధుశీలుఁడు ఈ నడుమ వ్రాసిన వ్యాసమునందలి భావములను గొన్నిఁటి నిందను నదించితిమి.

సత్యాగ్రహ ప్రభావము

"ప్రకృతము భరతఖండమున జరుగుచున్న సంఘర్షణము ప్రపంచేతిహాసమునందు ఇదివఱ కెన్నఁడు కని విని యెఱుఁగని యపూర్వసమస్యయై యున్నది. బుద్ధుఁడు అహింసా సిద్ధాంతము సుపదేశించెను; అనుష్ఠించెను; కాని అగచాట్లపాలు గాలేదు. జీససు దాని నుపదేశించెను; అనుష్ఠించెను; అగచాట్లం బడెను; కాని దాని యర్ధము సువ్య క్తము గావింపలేదు. మహాత్ముఁడు ఉపదేశించెను; అనుష్ఠించెను; అగచాట్లం బడెను; తత్పరమార్థమును ప్రపంచ మందలి ఆబాలగోపాలమునకుఁ గరతలామలకము గావించుటయే కాక, వారు దాని నవగతము జేసికొని సుశిక్షితులై సంఘీభావమున ధారాళముగ సాధించునట్లు వారిని పరిపాకమునకుం దెచ్చినాడు. ఈ విధానము భరతఖండమునకే గాక, సమస్తప్రపంచమునకు నిట్టి ప్రయోజనముల నొడగూర్చు నని ఎవ్వరును ఎన్నఁడును కలనైనఁ దలంపలేదు.

పాశ్చాత్య రాజకీయతంత్రములను సూక్ష్మదృష్టితోఁ బరిశీ లింపుడు, అవి యన్నియు కేవలము మోసము కుటిలత వంచనము కపటము లోనగు మాయోపాయములపై నాధారపడియున్నవి.

27