పుట:మధుర గీతికలు.pdf/735

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. శ్రీకృష్ణావతారము.

కర్మయోగము.

తొల్లి - యాదవులు ఇంద్రుని యనుగ్రహము గోరి ఇంద్ర యాగము సేయ సమకట్టిరి. అంత [1] శ్రీకృష్ణుడు [2] సంకర్షణునిం గూడి వారి కిట్లనియె :

“ఇంద్రుఁడు నాకలోకాధిపతి. భూలోకవాసుల మగుమనకు అతనితో నే ప్రయోజనమును లేదు. పశుపాలనా కృషి వాణి జ్యాదుల జీవించు మనము గోవులను గిరులను తరుసస్యాదులను పూజింపనగుఁగాని, ఇంద్రుని సంభావింపఁదగదు -


అపకారంబులు సేయ వెవ్వరికి, నేకాంతంబులందుండ, నా
తవ శీరానిల వర్షవారణములై త్వగ్గంధ నిర్యాస భ
స్మపలాశాగ్ర మరంద మూల కుసుమ చ్చాయా ఫలశ్రేణిచే
నుపకారంబులు సేయు వర్థులకు, నీ యుర్వీజముల్‌ గంటిరే.

 

-భాగవతము



"కేవలము పర్వతములకు
గోవులకు బ్రియంబు గాగఁ గోరి మఖంబుల్
గావింత, మెన్నివిధముల
భావించిన నింద్రుతోడి నని మన కేలా ?

  1. కృష్ణ సంకర్షణ, పదములు కృషి కర్షణ శబ్దముల నుత్పన్నములు. కృషి కధిష్ఠానదేవతయగుటచే కృష్ణుఁడు కర్మయోగి.
  2. సంకర్షణుఁడు అనఁగా బలరాముఁడు. ఈతని హలధరుఁడనియునందురు. హల మనఁగా నాగలి కావున ఈతఁడు వ్యవసాయమున కధిష్ఠానదేవత.

14