పుట:మధుర గీతికలు.pdf/733

ఈ పుట ఆమోదించబడ్డది

పదత్రయముచే సమస్తజగముల నాక్రమించి ఆతని రసాతలమున కడఁగఁద్రొక్కెను.

నేఁడు బ్రిటిషు ప్రభుత్వము మాయాబలముచే ధరామండలము నెల్ల నాక్రమించెను. గాంధీదేవుఁడు వామనుఁడై - లవణ శాసననిర్మూలనము మధ్యపాననిషేధము, విదేశవస్త్ర బహిష్కరణము అను పదత్రయమున విక్రమించి, బ్రిటిషుబలము నధోగతిపాలుచేసి, దేశసౌభాగ్యము గూర్ప నుద్యమించెను.

6.పరశురామావతారము.

నిరంకుశతా నిర్మూలనము.


తొల్లి - కార్తవీర్యాది క్షత్రియవీరులు నిరంకుశులై లోక కంటకముగ ధరాతలమును బాలించుచుండిరి. శ్రీహరి పరశురాముఁడై యవతరించి వారి నెల్లఁ బరిమార్చి, భూమండలము నంతను కశ్యపాది మహర్షులకు దానమిచ్చి తాను తపోవనమున కరిగెను.

నేఁడు - బ్రిటిషువారు విశృంఖలులై నిరంకుశ విధానముచే అన్యదేశముల నాక్రమించి ప్రజాసంక్షోభ మొనర్చుచుండిరి. గాంధి దేవుఁడు సత్యాగ్రహ మను పరశువు ధరించి, వైరివీరుల నిరంకుశతను నిర్మూలనము జేసి, దేశమును ప్రజాయత్తప్రభుత్వమున కర్పించి, జీవితాశేషమును నిర్వికల్పసమాధి యందుఁ గడప సంకల్పించెను.

12