పుట:మధుర గీతికలు.pdf/730

ఈ పుట ఆమోదించబడ్డది

జనించెను. విష్ణువు కూర్మమై పర్వతమును ధరించి మోహనాకృతితో ముప్పదిమూఁడుకోట్ల దేవతల కా యమృతముం బంచి శాశ్వతసౌఖ్యము బ్రసాదించెను.

నేఁడు - మోహనదాసు (గాంధి) సత్యాగ్రహ మను శైలమునకు అహింస యను తఱిఁదాటిని జుట్టి సముద్రము మధించి లవణ మను అమృతము సాధించెను; ముప్పదిమూఁడు కోట్ల భారతీయులకు దానిం బంచి, వారి దారిద్ర్యమం బాఱఁదోలి నిత్యసంపద ఘటించెను.

(ఉప్పును అమృతముతోఁ బోల్చుట చాలమందికి వింతగఁ దోవవచ్చును. దాని ప్రాశస్త్యమును ప్రాముఖ్యమును స్థలాంతరమున అనుబంధము నందలి యంశములు పరికించినయెడఁ దెలియఁగలవు.)

3. వరాహావతారము,

పతితలోక సముద్ధరణము.

తొల్లి - హిరణ్యాక్షుఁడు భూమిని చాపచుట్టగఁ జుట్టి చంక నిడుకొని బాతాళమున దాగియుండెను. శ్రీహరి వరాహరూపమున నవతరించి ఆ దానవుని సంహరించి క్రుంగిన భూమిని తనకొమ్మున నుద్ధరించెను.

నేఁడు - బ్రిటిషు ప్రభుత్వము భారతభూమిని సత్వము నపహరించి యధోగతి పాలొనర్చెను. గాంధీమహాత్ముడు అసహాయ యోగ మను కొమ్మున భూమిని లేవనెత్తి రక్షింప సమకట్టెను

9